Breaking News

మోదీ ‘దీపావళి గిఫ్ట్’ ప్రకటన వేళ.. ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌

మోదీ ‘దీపావళి గిఫ్ట్’ ప్రకటన వేళ.. ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌


Published on: 03 Sep 2025 11:45  IST

దీపావళి పండుగలో ప్రజలకు ఊరట కలిగించేందుకు వస్తువులపై జీఎస్టీ (GST) రేట్లు తగ్గించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో పన్నుల రేట్ల మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.

గత ఎనిమిదేళ్లలో జీఎస్టీ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. రోజువారీ ఉపయోగించే ఉత్పత్తులపై పన్ను తగ్గిస్తామని ఆయన అప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా జీఎస్టీలో ఇకపై రెండు ప్రధాన శ్లాబులే (Slabs) ఉంటాయని, కొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు మాత్రమే వేరే రేట్లు వర్తిస్తాయని స్పష్టంచేసింది. ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబులు కుదించబడనున్నాయి.

ధరలు తగ్గే అవకాశమున్న ఉత్పత్తులు
బిస్కట్ల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అనేక ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. జీవిత బీమాపై పన్ను పూర్తిగా ఎత్తివేసే అంశాన్ని కూడా కౌన్సిల్ పరిశీలిస్తోంది. సుమారు 500 ఉత్పత్తులపై రేట్లలో మార్పులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రాల ఆందోళనలు
జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళనలతో ఎన్డీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ముందుగా సమావేశమయ్యారు. పన్ను తగ్గింపుల వల్ల వచ్చే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని వారు కోరారు. ఆ ప్రతిపాదనలను కౌన్సిల్ భేటీలో అధికారికంగా సమర్పించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మద్దతు
జీఎస్టీ సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. మధ్యాహ్నానికి కౌన్సిల్ నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి