Breaking News

జూబ్లీహిల్స్‌ రోడ్‌షోలో రేవంత్ వ్యాఖ్యలు వివాదాస్పదం

జూబ్లీహిల్స్‌ రోడ్‌షోలో రేవంత్ వ్యాఖ్యలు వివాదాస్పదం


Published on: 01 Nov 2025 10:00  IST

జూబ్లీహిల్స్‌లో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటేస్తే ప్రభుత్వ పథకాలు రద్దవుతాయని ఆయన స్పష్టంగా చెప్పడంతో ఓటర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. “బీఆర్‌ఎస్‌కి ఓటేస్తే మీ పిల్లలకు సన్నబియ్యం దొరకదు, పేద కుటుంబాలకు ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదు” అని రేవంత్‌ హెచ్చరించారు.

ఆయన ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. “ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే ఇన్ని పథకాలు రద్దు చేస్తారా?” అంటూ జూబ్లీహిల్స్‌ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. రెండు సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి పనులపై మాట్లాడకుండా ప్రజల సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ నేత వై. సతీశ్‌రెడ్డి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “ప్రజలను బెదిరించడం ముఖ్యమంత్రికి తగదు. సీఎంగా ఉన్నవారు చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి కానీ, పథకాలు రద్దు చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆప్‌ కార్యకర్తల నిరసనతో కలకలం

ఇదే సమయంలో, రేవంత్‌ రోడ్‌షో జరుగుతున్న సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంగళ్‌రావునగర్‌ కృష్ణకాంత్‌ పార్క్‌ వద్ద ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు నెలకు రూ.2500 సాయం, విద్యార్థినులకు స్కూటీలు, చిత్రపురి కాలనీ అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని వారు కోరారు.

పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆప్‌ నాయకురాలు హేమ మాట్లాడుతూ, “హామీల కోసం అడగడం మా తప్పా? మహిళలను ఈడ్చి తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికి అవమానం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి