Breaking News

ఏఐతో షాపింగ్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన చాట్ జీపీటీ..!

అద్భుతాన్ని ఆవిష్కరించిన చాట్ జీపీటీ..! ఇప్పుడేమిటంటే.. చాట్ జీపీటీతో షాపింగ్ కూడా చేయొచ్చు!


Published on: 02 May 2025 16:03  IST

డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని మనం రోజూ చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ప్రపంచం ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. ఈ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నది ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ. మొదటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు ఏ చిన్న పని అయినా త్వరగా, సులభంగా పూర్తి చేయాలంటే చాలామంది దీన్ని నమ్ముతున్నారు.

ఇటీవలి వరకు ఈమెయిల్స్, కంటెంట్, డిజైన్ వంటివాటికి మాత్రమే ఇది ఉపయోగపడింది. అయితే తాజాగా ఓపెన్‌ఏఐ మరొక వినూత్న ఫీచర్‌ను తీసుకొచ్చింది  అదే షాపింగ్ అసిస్టెన్స్. అంటే మీరు ఇకపై చాట్ జీపీటీ సాయంతో గిఫ్ట్‌లు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

ఈ సదుపాయాన్ని ఓపెన్‌ఏఐ తన తాజా మోడల్ GPT-4o ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల వలెనే వస్తువుల ధరలు, రివ్యూలు, ఫీచర్లు, కొనుగోలు లింకులు అన్నీ పొందొచ్చు. అంతే కాదు, మీ అభిరుచి, అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత రికమండేషన్లు కూడా చాట్ జీపీటీ అందించగలదు.

ఓపెన్‌ఏఐ స్పష్టం చేసిన విషయమేమిటంటే  వినియోగదారుల ప్రశ్నలకు అనుగుణంగా కస్టమైజ్ చేసిన రిజల్ట్స్‌ను అందించేందుకు ఇది థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న ధరలు, సమీక్షలు, ఫీచర్లను విశ్లేషించి, వాటిని నిర్మాణాత్మక డేటాగా చూపిస్తుంది.

ఇదే సమయంలో, చాట్ జీపీటీ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై తమకు ఎటువంటి రిఫరల్ కమీషన్‌లు రావని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. అంటే, ఇది పూర్తిగా వినియోగదారుడికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే రూపొందించబడింది.

ఈ అప్‌డేట్‌తో ఉత్పత్తులను కనుగొనడం, పోల్చడం, వాటి గురించి సమీక్షలు తెలుసుకోవడం మరింత సులభతరం అయ్యింది. ఇప్పుడే ప్రయత్నించి చూడండి  షాపింగ్‌కు కొత్తగా మారిన AI అనుభవాన్ని మీరు తప్పక ఆస్వాదిస్తారు!

Follow us on , &

ఇవీ చదవండి