Breaking News

తెలంగాణ రైజింగ్–2047: భవిష్యత్‌కు దిశానిర్దేశం చేసే విజన్ డాక్యుమెంట్

తెలంగాణ రైజింగ్–2047: భవిష్యత్‌కు దిశానిర్దేశం చేసే విజన్ డాక్యుమెంట్


Published on: 01 Dec 2025 10:19  IST

గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఒక సమగ్ర పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది కేవలం ప్రభుత్వ పథకాలకు పరిమితమైన పత్రం కాదని, రాబోయే తరాల కోసం దేశానికి అంకితమయ్యే విజన్‌గా తయారవుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో 13 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్’ జరుగుతుందని, డిసెంబర్ 9న ‘విజన్–2047’ విధానాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

లక్షలాది ప్రజల భాగస్వామ్యంతో విజన్ రూపకల్పన

విజన్ డాక్యుమెంట్‌ను ‘తెలంగాణ రైజింగ్–2047’గా పిలుస్తున్నామని, ఇందులో స్పష్టమైన లక్ష్యాలు (విజన్)తో పాటు ఆ లక్ష్యాలను చేరుకునే వ్యూహాలు (స్ట్రాటజీ) ఉంటాయని సీఎం వివరించారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో లక్షలాది మంది ప్రజలను భాగస్వాముల్ని చేయడం విశేషమని చెప్పారు. నీతి ఆయోగ్, ఐఐఎస్బీ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో ప్రతి రంగాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రాన్ని మూడు ముఖ్య ప్రాంతాలుగా విభజించి ప్రత్యేక అభివృద్ధి విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ (క్యూర్)గా, ఓఆర్‌ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ (ప్యూర్)గా, ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాలను రూరల్ అగ్రికల్చరల్ రీజనల్ ఎకానమీ (రేర్)గా గుర్తించి ప్రణాళికలు అమలు చేస్తామని వివరించారు.

కాలుష్య రహిత నగరం లక్ష్యంగా క్యూర్ ప్రాంతం

దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు కాలుష్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యమని అన్నారు. కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఈ ప్రాంతం నుంచి బయటకు తరలిస్తున్నామని, క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూసీ నది శుద్ధి, మెట్రో విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు ఈ ప్రణాళికలో భాగంగా అమలవుతాయని స్పష్టం చేశారు.

ప్యూర్ ప్రాంతంలో పరిశ్రమలకు ఊపిరి

ఔటర్ రింగ్ రోడ్ అవతల సుమారు 360 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్లు నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రాంతాన్ని ప్యూర్‌గా అభివర్ణిస్తూ, ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు అనేక వర్గాల పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలు, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

వ్యాపార ఎగుమతులు, దిగుమతులకు సముద్రపోటు అవసరమని, తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్ట్‌కు ప్రత్యేక కనెక్టివిటీ కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం జరగనుందని చెప్పారు.

వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం

తెలంగాణలో ప్రస్తుతం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రమే ఉండటంతో, వరంగల్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని సీఎం తెలిపారు. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయన్నారు. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల సమగ్ర కనెక్టివిటీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు.

రేర్ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత అభివృద్ధి

రీజనల్ రింగ్ రోడ్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని రేర్‌గా గుర్తించి, వ్యవసాయ ఉత్పత్తులు మరియు అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు సీఎం తెలిపారు. రైతుల ఆదాయం పెంచడం, గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధించడం ఈ ప్రణాళిక లక్ష్యమని చెప్పారు. క్యూర్, ప్యూర్, రేర్ మూడు విభాగాల సమన్వయంతో తెలంగాణ ముఖచిత్రాన్ని పూర్తిస్థాయిలో మార్చేలా ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ రూపొందించామని తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా రెట్టింపు లక్ష్యం

తెలంగాణ జనాభా దేశ జనాభాలో 2.5 శాతం మాత్రమే కాగా, దేశ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర వాటా ఇప్పటికే 5 శాతంగా ఉందని సీఎం గుర్తు చేశారు. దీన్ని రాబోయే కాలంలో 10 శాతానికి పెంచడమే లక్ష్యమని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.

నాణ్యమైన విద్య, సాంకేతిక విద్య అందించేందుకు అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘‘మనకు దేశంలోని రాష్ట్రాలు కాదు… చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాలే పోటీ’’ అని సీఎం వ్యాఖ్యానించారు.

తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు ― జిల్లాల వారీగా సందడి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణను ప్రపంచ స్థాయిలో పోటీ పడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. డిసెంబర్ 1 నుంచి 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా తెలంగాణ రైజింగ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌లోని స్టాళ్లను ప్రజల కోసం డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో తెరిచి ఉంచనున్నట్లు వెల్లడించారు.

విజన్ డాక్యుమెంట్‌పై ముమ్మర కృషి

విజన్–2047 డాక్యుమెంట్‌పై అన్ని శాఖలు లోతైన అధ్యయనం చేసి నివేదికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నాటికి మంత్రులు, అధికారులు నివేదికలు సమర్పించాలని, చివరి దశలో సీఎం కార్యాలయం అవసరమైన మార్పులు చేసి తుది ప్రతిని సిద్ధం చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 6 నాటికి విజన్ డాక్యుమెంట్ పూర్తిగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి