Breaking News

ట్రంప్ వ్యాఖ్యలతో ఐరోపాలో రాజకీయ కలకలం

ట్రంప్ వ్యాఖ్యలతో ఐరోపాలో రాజకీయ కలకలం గ్రీన్‌లాండ్‌ కేంద్రంగా అమెరికా–యూరప్‌ ఉద్రిక్తతలు


Published on: 21 Jan 2026 10:05  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు, నిర్ణయాలు ఐరోపా దేశాల్లో రాజకీయ అలజడిని రేపుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ అంశంపై తన వైఖరిని మరింత దూకుడుగా వ్యక్తం చేస్తూ, ఐరోపా దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించడం, ఐరోపా నేతల వ్యక్తిగత సందేశాలను బహిర్గతం చేయడం, భారీ సుంకాల బెదిరింపులు చేయడం ద్వారా అమెరికా–యూరప్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.

ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. భారత మార్కెట్లైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.9.86 లక్షల కోట్లు తగ్గిపోయింది.

చాగోస్‌ అంశంలో ట్రంప్ యూటర్న్

చాగోస్‌ ద్వీపాలను మారిషస్‌కు అప్పగించాలన్న బ్రిటన్‌ నిర్ణయంపై గతంలో సానుకూలంగా స్పందించిన ట్రంప్‌, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

హిందూ మహాసముద్రంలో ఉన్న డీగో గార్షియా ద్వీపం అమెరికా సైనిక స్థావరాలకు అత్యంత కీలకమని పేర్కొన్న ట్రంప్‌, బ్రిటన్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అమెరికా బలహీనంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇది చైనా, రష్యా వంటి దేశాలకు లాభపడే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే కారణంగా గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఆసక్తి పెరిగిందని కూడా ట్రంప్ సూచించారు.

ట్రంప్ వ్యాఖ్యలు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ను ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే చాగోస్‌ మారిషస్‌కు అప్పగించినా, డీగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరం మరో వందేళ్లపాటు కొనసాగుతుందని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏఐ చిత్రాలతో మరో వివాదం

గ్రీన్‌లాండ్ అంశాన్ని మరింత రెచ్చగొట్టేలా ట్రంప్ రెండు ఏఐ సృష్టించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక చిత్రంలో ఐరోపా నేతలతో గ్రీన్‌లాండ్‌పై చర్చిస్తున్నట్లు చూపించారు. మరో చిత్రంలో గ్రీన్‌లాండ్ మంచుకొండల మధ్య అమెరికా జెండాతో ట్రంప్ కనిపించారు.

ఈ చిత్రానికి “గ్రీన్‌లాండ్ అమెరికా భూభాగం – 2026” అనే క్యాప్షన్ ఇవ్వడం కొత్త వివాదానికి దారితీసింది. ఈ చర్యను ఐరోపా నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.

ఫ్రాన్స్‌పై భారీ సుంకాల బెదిరింపు

గ్రీన్‌లాండ్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ ముందుండటంతో ట్రంప్ ఆగ్రహం మరింత పెరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన వైన్‌, షాంపేన్‌ ఉత్పత్తులపై 200 శాతం సుంకాలు విధిస్తానని ఆయన హెచ్చరించారు.

ఇంతకుమించి, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తనకు పంపిన వ్యక్తిగత సందేశాన్ని కూడా ట్రంప్ బహిర్గతం చేయడం సంచలనంగా మారింది. ఈ చర్య దౌత్య పరంగా అనుచితమని ఐరోపా దేశాలు విమర్శించాయి.

ప్రైవేటు సందేశాల వెల్లడి

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా పలువురు ఐరోపా నేతలు తనకు పంపిన వ్యక్తిగత సందేశాలను ట్రంప్ బహిర్గతం చేశారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా భద్రత కోసమే స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూట్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పంపిన సందేశాల్ని బయటపెట్టడం ద్వారా ట్రంప్ దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రతీకార చర్యలకు ఐరోపా సిద్ధం

ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ గట్టి ప్రతిస్పందనకు సిద్ధమవుతోంది. మూడు ప్రధాన చర్యలపై ఐరోపా దేశాలు చర్చలు జరుపుతున్నాయి.

  1. అమెరికాపై ప్రతీకార సుంకాలు

  2. ఈయూ–అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిపివేత

  3. అమెరికా కంపెనీలు, వ్యక్తులపై ఆంక్షలు

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ దేశాల సార్వభౌమత్వంపై ఎలాంటి రాజీ ఉండదని ఆమె తేల్చిచెప్పారు.

అమెరికా నుంచే భిన్న స్వరాలు

ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికాలోనూ విభిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఐరోపాకు మద్దతు తెలుపుతూ, ట్రంప్ సుంకాల బెదిరింపులు అనవసరమని వ్యాఖ్యానించారు.

అయితే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాత్రం అమెరికా–యూరప్ సంబంధాలు ఇంకా బలంగానే ఉన్నాయని, ఈ వివాదం చల్లారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రీన్‌లాండ్‌కు అమెరికా సైనిక బలోపేతం

ఉద్రిక్తతల నడుమ అమెరికా మరో కీలక అడుగు వేసింది. గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్ వద్ద ప్రత్యేక రక్షణ విమానాన్ని మోహరించనున్నట్లు నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ప్రకటించింది. దీర్ఘకాల భద్రతా అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి