Breaking News

గిగ్ వర్కర్స్‌కు తీపికబురు.. బిల్లుపై నేడు CM రేవంత్ కీలక సమీక్ష

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్


Published on: 21 Jul 2025 09:35  IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం నుండి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని వానాకాలం పంటల సాగు పరిస్థితులపై సమీక్ష జరగనుంది. రైతులకు అవసరమైన వనరులు, ముఖ్యంగా యూరియా వంటి ఎరువుల సరఫరా, భూసార పరీక్షల ప్రాధాన్యత వంటి వ్యవసాయ సంబంధిత అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్లకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

ఇతర అంశాల్లో భాగంగా వాతావరణ మార్పుల ప్రభావంతో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. కాలుష్యం, వర్షాలు, తేమ పెరిగే పరిస్థుల్లో ప్రజారోగ్యం ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతో ఆరోగ్య శాఖతో కలిసి కలెక్టర్లు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సీఎం వివరించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఇవ్వబడుతున్న రేషన్ కార్డుల పంపిణీ వేగం ఎలా ఉంది? అనేది కూడా సీఎం అడిగి తెలుసుకోనున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మరో ముఖ్యమైన అంశంపై సమీక్ష కొనసాగుతుంది. గిగ్ వర్కర్స్‌ కోసం రూపొందించిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ బిల్లు–2025 పై ఈ సమీక్ష జరుగనుంది. ఈ బిల్లుతో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడం, ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, అలాగే ఈ వర్గానికి పని ఇచ్చే సంస్థలపై నైతిక మరియు చట్టపరమైన బాధ్యతలు వేయడం వంటి అంశాలు ఉన్నాయి.

ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు, ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరించేందుకు ముందుగా ఈ బిల్లును పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. ఈ సమావేశంలో మంత్రులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. వ్యవసాయ రంగం, ప్రజారోగ్యం, నూతన సంక్షేమ చట్టాలు — అన్నింటిపై సమగ్ర సమీక్ష జరగబోతున్న ఈ భేటీని ప్రభుత్వ పరిపాలనలో కీలకమైనదిగా భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి