Breaking News

392 కిలోమీటర్ల ‘ఔటర్‌ రింగ్‌ రైలు’ ప్రాజెక్టు తుది ఎలైన్‌మెంట్‌ ఖరారైంది.

దేశంలో మొట్టమొదటిది, ప్రతిష్ఠాత్మక ‘ఔటర్‌ రింగ్‌ రైలు’ ప్రాజెక్టు తుది ఎలైన్‌మెంట్‌ ఖరారైంది.


Published on: 21 Jul 2025 09:58  IST

దేశంలో మొట్టమొదటి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక పురోగతి జరిగింది. దాదాపు 392 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ ప్రాజెక్ట్‌కు తుది ఎలైన్‌మెంట్‌ను దక్షిణ మధ్య రైల్వే ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు — మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేటలలో 14 మండలాలను కలుపుతుంది. మొత్తం రూ.12,070 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో కొత్తగా 26 రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు. ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మాసాయిపేట, గజ్వేల్ వంటి ప్రాంతాలపై ఈ రింగ్ రైలు వెళ్లనుంది.

ఇది పూర్తయితే రాష్ట్రంలోని దూర ప్రాంతాలు తక్కువ సమయంతో అనుసంధానమవుతాయి. మొదట 508 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించినా, తుది సర్వేలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచనలతో 392 కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేశారు. ఈ మార్గం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR)కి సమీపంగా ఉండటంతో అభివృద్ధికి అనువైనదిగా భావించి ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను (DPR) రైల్వే బోర్డుకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ రింగ్ రైలు మార్గం, హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే 361 కిలోమీటర్ల RRRకి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వెళుతుంది. కొన్ని చోట్ల ఈ దూరం 11 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ముఖ్యంగా మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ ప్రాంతాల్లో 'రైల్ ఓవర్ రైల్' (ROR) బ్రిడ్జులు నిర్మించనున్నారు. ఫ్లైఓవర్ తరహాలో రైల్వే లైన్‌ను ఎత్తుగా నిర్మిస్తారు.

ఈ ప్రాజెక్టు సామాజిక, ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ప్రధానంగా నగర శివారులోని ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదం చేయనుంది. రింగ్ రైలు RRRకి దగ్గరగా ఉండటంతో రోడ్డు, రైలు మార్గాలు కలసి వేగవంతమైన రవాణా పరిష్కారాన్ని అందిస్తాయి. ఆయా స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో లైన్లను కలుపుతూ మల్టీమోడల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది.

ఈ రింగ్ రైలు ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచే అవకాశం ఉంది. దీని వల్ల ప్రజలు ఎక్కువగా రైలు, బస్సులపై ఆధారపడతారు. ఫలితంగా, ప్రైవేట్ వాహనాల వాడకం తగ్గుతుంది. ఇది కాలుష్యాన్ని తగ్గించడంలో, ఇంధన ఆదాయంలో ఉపయోగపడుతుంది. శివారు ప్రాంతాల్లో కొత్త టౌన్‌షిప్‌లు, పరిశ్రమల అభివృద్ధి జరగడంతో అభివృద్ధి ఒక్క హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా విస్తరించనుంది.

ఇలా చూస్తే, ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, రాష్ట్రానికి సమతుల్యమైన అభివృద్ధిని తీసుకొచ్చే ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.

Follow us on , &

ఇవీ చదవండి