Breaking News

కాళేశ్వరం అవకతవకలు.. కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ..

కాళేశ్వరం అవకతవకలు.. కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ..


Published on: 04 Aug 2025 10:30  IST

తెలంగాణలో ఓ క్రూషియల్ మలుపు తిరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో సంభవించిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో “తెలంగాణకు వరం” అని పేర్కొన్న ఈ ప్రాజెక్టు, ప్రజాధనాన్ని వృథా చేసిన ఓ విఫల ప్రణాళికగా మారిందని ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వెల్లడించింది.

ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమవుతోంది. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై కమిషన్‌ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వం సభ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ కమిషన్ నివేదికలో అప్పటి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌ల పాత్రలు, అలాగే కీలక అధికారులు తీసుకున్న నిర్ణయాలపై వివరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఇంజినీర్లు మురళీధర్, హరిరామ్ ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయినట్టు సమాచారం. అదే విధంగా మాజీ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషీ, సీఎంవో అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సభర్వాల్ వంటి పలువురు అధికారులపై కూడా చర్యలపై చర్చకు అవకాశం ఉంది.

ఈ విచారణపై ఇప్పటికే ప్రభుత్వం సాధారణ పరిపాలన, న్యాయ, సాగునీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆదివారం సాయంత్రం సచివాలయంలో భేటీ అయి నివేదికపై సిఫార్సులు చేసింది. ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో అవే సిఫార్సులు ప్రాధాన్యత పొందనున్నాయి.

ఈ అంశంపై మొదటిసారిగా కేవలం ఒక్క అంశాన్ని ఎజెండాగా తీసుకొని క్యాబినెట్ సమావేశం జరగనుండటం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. ఇది సర్కారు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో తెలియజేస్తోంది. కాబట్టి, శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఈ నివేదికను ప్రస్తావించి ప్రజలకు పూర్తి సమాచారం అందించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ఇక భవిష్యత్ కార్యాచరణలో భాగంగా — ఏసీబీ విచారణ, లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతో ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించే అవకాశమున్నది. కాళేశ్వరం వివాదంపై చర్యల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు, పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి