Breaking News

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది! ఆయనపై నమోదైన ఒక కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక కానిస్టేబుల్ ఈ కేసును కొనసాగించలేనని చెప్పడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. రఘురామకృష్ణరాజు తనయుడు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గత ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని రఘురామ ఆరోపించారు.


Published on: 26 Aug 2025 09:20  IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఊరట దక్కింది. ఆయనపై నమోదైన కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో 2022 జులైలో నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్.ఫారూఖ్ బాషా నమోదు చేశారు. తాను హైదరాబాద్‌కు దూరంగా ఉన్నందున కేసును కొనసాగించలేనని కానిస్టేబుల్ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కానిస్టేబుల్ ఫారూఖ్ బాషా అనంతపురంలో విధులు నిర్వహిస్తున్నారు.. హైదరాబాద్‌కు వచ్చి కేసును కొనసాగించడం కష్టమని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్, ఇతర సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తాను హైదరాబాద్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురంలో విధుల్లో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. అందుకే హైదరాబాద్‌కు వచ్చి కేసును కొనసాగించలేను అన్నారు. అందుకే కోర్టు కేసును కొట్టేసింది.

2022 జూన్‌లో హైదరాబాద్‌లో రఘురామకృష్ణరాజు ఇంటిపై నిఘా పెట్టారని ఒక కానిస్టేబుల్‌ను పట్టుకున్నారు. రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్, CRPF సిబ్బంది కలిసి అతన్ని పోలీసులకు అప్పగించారు. కానిస్టేబుల్ ఫారూఖ్ బాషా తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని రఘురామకృష్ణరాజు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ నెల 4న కానిస్టేబుల్ తన కేసును కొనసాగించదలచుకోలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది.. సోమవారం మళ్లీ విచారణ జరగ్గా కానిస్టేబుల్‌ ఫారూఖ్‌ బాషా కేసు ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
కానిస్టేబుల్‌ అభిప్రాయాన్ని కోరిన ధర్మాసనం అనంతరం ఈ కేసును కొట్టేసింది.
 

Follow us on , &

ఇవీ చదవండి