Breaking News

హైదరాబాద్‌లో మొత్తం 171 చెరువులు కబ్జాదారుల పరమయ్యాయి..?

రాజధానిలో చెరువులు ఆక్రమణలలో చిక్కుకున్నాయి. మొత్తం 171 చెరువులు పాక్షికంగానో... పూర్తిగానో కబ్జాదారుల పరమయ్యాయి.


Published on: 16 May 2025 09:53  IST

హైదరాబాద్‌ నగరం రోజురోజుకు అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నా, నగరానికి ఆధ్యాత్మికంగా, పర్యావరణ పరంగా ప్రాణంగా ఉన్న చెరువులు మాత్రం క్రమంగా కనుమరుగవుతున్నాయి. చెరువులు ఆక్రమణల కోపంలో చిక్కుకుని తమ అసలు రూపాన్ని కోల్పోతున్నాయన్న ఆందోళనకరమైన నిజాన్ని తాజాగా ఒక ప్రభుత్వ సంస్థ నివేదిక బయటపెట్టింది.

తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్‌ (TGRAC) తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం, రాజధాని ప్రాంతంలోని 171 చెరువులు పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ అక్రమ నిర్మాణాలకి బలి అయ్యాయి. ఈ ఆక్రమణల ద్వారా మొత్తం 386.72 ఎకరాల భూమి పోయిందని నివేదిక స్పష్టం చేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు హైదరాబాద్‌ పరిధిలో 920 చెరువులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ, కాలక్రమంలో వీటిలో చాలా చెరువులు మాయమయ్యాయి.

  • 225 చెరువులు పూర్తిగా ఆక్రమించబడ్డాయి.

  • 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి.

  • రాష్ట్ర విభజన తరువాత 44 చెరువులు పూర్తిగా గానీ, 127 పాక్షికంగా గానీ ఆక్రమించబడి... మొత్తం 171 చెరువులు కనుమరుగయ్యాయి.

ఇవి గూగుల్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా టీజీఆర్‌ఏసీ రూపొందించిన నివేదికలో పొందుపరిచారు.

చెరువుల భూములపై భారీ నిర్మాణాలు సాగుతున్న ఉదాహరణలు నగరమంతా కనిపిస్తున్నాయి. కొన్నింటిని అధికారికంగా నివేదికలో ప్రస్తావించారు:

  • పుప్పాలగూడలో రూ.1,050 కోట్ల అంచనాతో 59 అంతస్తుల భవనం నిర్మాణం సాగుతోంది. ఇది పూర్తిగా ఎఫ్‌టీఎల్‌  పరిధిలో ఉంది.

  • మియాపూర్ – రామచంద్రాపురం కుంట సమీపంలో రూ.1,005 కోట్ల విలువైన అపార్టుమెంట్ ప్రాజెక్టు చెరువు భూమిలోనే నడుస్తోంది.

  • మూసాపేట, నెక్నాంపూర్, బండ్లగూడ జాగీర్, గోపన్‌పల్లి – నల్లగండ్ల, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లోని అనేక భవనాలు చెరువులపై అక్రమంగా నిర్మించబడ్డాయి.

కొన్నింటి నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వాణిజ్య ప్రాజెక్టులపై కొన్ని కేసులు ఇప్పటికే సుప్రీం కోర్టు వరకు వెళ్ళాయి.

ఇన్ని ప్రాజెక్టులు చెరువుల మీద వుండడంతో, వీటిపై చర్యలు తీసుకోవాల్సిన హైడ్రా (Hyderabad Lakes Protection Committee) ఇప్పటి వరకు ఏ నోటీసులు జారీ చేయకపోవడం విమర్శలకు గురవుతోంది. ఈ నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

ప్రస్తుతానికి చెరువుల భూముల్లో జరిగే అక్రమ నిర్మాణాల విలువ అంచనాల ప్రకారం రూ.27 వేల కోట్లకు పైగా ఉంటుంది. అంటే, ప్రభుత్వ భూములు, జలవనరులు మాయమవుతుండటమే కాదు, భవిష్యత్‌లో వచ్చే నీటి కొరత, వరదల ప్రమాదాలకు ఇది దారితీయవచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌ అభివృద్ధి చేయాల్సిందే కానీ, పర్యావరణాన్ని దెబ్బతీసేలా కాదు. చెరువులు కేవలం నీటి మూలాలు కాదు... అవి నగరంలోని జీవ వ్యవస్థలో భాగం. ఇవి కాపాడకపోతే రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు తప్పవన్నది స్పష్టమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి