Breaking News

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం బంద్‌ ప్రభావం – రాష్ట్రం అంతా స్తబ్ధం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం బంద్‌ ప్రభావం – రాష్ట్రం అంతా స్తబ్ధం


Published on: 18 Oct 2025 09:41  IST

బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో బీసీ ఐకాస పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని రంగాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్‌, భాజపా, భారత్‌ రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీతో పాటు మాలమహానాడు, ఎమ్మార్పీఎస్‌, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలు చేపట్టారు. బస్సులు డిపోల నుండి బయలుదేరకుండా అడ్డుకుంటున్నారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు కూడా బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి. హైదరాబాద్‌లో ఉప్పల్‌, చెంగిచర్ల‌, కూకట్‌పల్లి డిపోల వద్ద బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. కూకట్‌పల్లిలోనే 125 బస్సులు డిపోలో నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో బంద్‌ ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ బీసీ సంఘాల నేతలు రోడ్లపై బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలు కూడా బంద్‌లో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌ నేతృత్వంలో ధర్నా జరిగింది. ఎంజీబీఎస్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, వరంగల్‌ డిపోల వద్ద బీసీ నేతలు నిరసన తెలిపారు.

మరోవైపు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించాలని డీజీపీ సూచించారు.

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ ఐకాస పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బస్సులు నిలిచిపోవడం, దుకాణాలు మూసివేయడం, ప్రజా రవాణా స్తంభించడంతో రాష్ట్రం మొత్తం బంద్‌ వాతావరణం నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి