Breaking News

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అప్రమత్తం – తీరప్రాంతాలకు ప్రత్యేక చర్యలు, ప్రజల రక్షణపై దృష్టి

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అప్రమత్తం – తీరప్రాంతాలకు ప్రత్యేక చర్యలు, ప్రజల రక్షణపై దృష్టి


Published on: 27 Oct 2025 09:51  IST

రాష్ట్రంపై ప్రభావం చూపే మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీఎం మాట్లాడుతూ, తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని, అలాగే ఇప్పటికే ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు.

మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలకు సమయానికి హెచ్చరికలు చేరేలా సమాచార వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌, సోషల్ మీడియా, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, వాట్సాప్‌ వంటి మార్గాల ద్వారా సమాచారం పంపాలన్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే తీరప్రాంత జిల్లాల్లో మోహరించాయని, రిజర్వాయర్లు మరియు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల మొబైల్ టవర్లకు డీజిల్ జనరేటర్లను సిద్ధం చేశామని, విద్యుత్‌, టెలికం, తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని తెలిపారు.

తీర ప్రాంత ప్రజలను ముందుగానే తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి, పునరావాసం కల్పించాల్సిందిగా ఆదేశించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించవచ్చని సూచించారు. రహదారులు, చెరువులు, కాలువలు దెబ్బతిన్నా తక్షణ మరమ్మతులు చేయాలని, జేసీబీలు, క్రేన్లు, డ్రోన్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

వ్యవసాయ శాఖ, ఆర్టీజీఎస్‌ వ్యవస్థ సమన్వయంతో పంట నష్టం అంచనా వేయాలని, అలాగే సముద్రంలో ఉన్న మెకనైజ్డ్‌, మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించాలని సీఎం ఆదేశించారు.

ఉద్యానశాఖ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా ఉద్యాన శాఖ గుంటూరులో కంట్రోల్ రూమ్ (హెల్ప్‌లైన్‌ నంబర్‌: 0863-2216470) ప్రారంభించింది. అధిక వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగితే రైతులు ఈ నంబర్‌కు సంప్రదించవచ్చు. తోటల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, అవసరమైతే శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులు వేసుకోవాలని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం గత వారం వర్షాల కారణంగా 21 జిల్లాల్లో 15 మండలాల్లో 283 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

మొంథా తుఫాన్‌పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు, అవసరమైన అన్ని శాఖలు అత్యవసర చర్యల్లో నిమగ్నమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి