Breaking News

గురువారం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌

గురువారం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌


Published on: 04 Dec 2025 10:38  IST

రెండు రోజుల అధికారిక పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన చివరిసారిగా 2021లో భారత్‌ను సందర్శించగా, దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ రావడం ఇదే తొలిసారి. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పుతిన్ పాల్గొననున్నారు. ఇరు దేశాధినేతల మధ్య అనధికార స్థాయిలో చర్చలు జరగనున్నాయని వర్గాలు తెలిపాయి.

శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు త్రివిధ దళాల గౌరవ వందనం అందజేయనున్నారు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మ గాంధీకి ఆయన నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో పుతిన్ కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో రక్షణ, శక్తి, వాణిజ్యం, అంతర్జాతీయ పరిస్థితులు వంటి అంశాలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు. దీని తర్వాత ప్రధాని మోదీ ఇచ్చే అధికారిక వర్కింగ్ లంచ్‌లో పుతిన్ పాల్గొంటారు.

దిల్లీలోని భారత్ మండపంలో ఫిక్కీ (భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పుతిన్ పాల్గొననుండగా, భారత–రష్యా వ్యాపార సంబంధాలపై ఆయన ప్రసంగించనున్నట్లు సమాచారం. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే అధికారిక విందుతో పుతిన్ భారత పర్యటన ముగియనుంది.

ఇక పుతిన్‌తో పాటు భారత్‌కు వచ్చిన రష్యా రక్షణ మంత్రి అంద్రే బెలొసోవ్ గురువారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో భారత సాయుధ దళాలకు సంబంధించిన కీలక రక్షణ ఒప్పందాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అదనపు ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఎస్‌యు-30 యుద్ధ విమానాల అప్‌గ్రేడ్, ఇతర రక్షణ సామగ్రి సరఫరా అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి.

అలాగే, పౌర అణు ఇంధన రంగంలో సహకారం పెంపొందించేలా భారత్–రష్యా మధ్య కొత్త అవగాహన ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం చేపడుతున్న రష్యా సంస్థ ‘రోసాటోమ్’కు సంబంధించి ఈ ఒప్పందం ఉండనుందని అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు రష్యా క్యాబినెట్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

పుతిన్ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్ష భద్రతా బృందానికి చెందిన ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమాండోలు ముందుగానే భారత్‌కు చేరుకుని, ఢిల్లీ పోలీసులు మరియు భారత జాతీయ భద్రతా దళాలతో కలిసి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, పుతిన్ సాధారణంగా ఉపయోగించే ప్రత్యేక లగ్జరీ అధ్యక్ష వాహనాన్ని కూడా రష్యా నుండి విమానంలో భారత్‌కు తరలించనున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి