Breaking News

ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసే ప్రయత్నాలు సాగుతున్నాయి.

మియన్మార్‌లో సంభవించిన భూకంపంలో కనీసం 1000 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


Published on: 29 Mar 2025 11:37  IST

మయన్మార్ (Myanmar)‌, థాయ్‌లాండ్‌ (Thailand) దేశాలను శుక్రవారం మధ్యాహ్న సమయంలో భూ ప్రకంపనలు ప్రారంభమయ్యాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.భారీ భూకంపం తరువాత కూడా రిక్టర్ స్కేలుపై 4.5 నుంచి 6.5 తీవ్రతతో మధ్య పలు చిన్న ప్రకంపనలూ (ఆఫ్టర్ షాక్స్) సంభవించాయి.  ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసే ప్రయత్నాలు సాగుతున్నాయి.. రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా మయన్మార్‌ ఈ విపత్తుకు తీవ్రంగా ప్రభావితమైంది. 

ప్రకృతి ప్రకోపానికి మయన్మార్‌లో కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్‌ మిలిటరీ (Myanmar military) అధికారులు ఈ ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో, 2376 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

గణనీయమైన నష్టం జరిగిందని రెడ్‌క్రాస్ కూడా ధ్రువీకరించింది. ఆరు ప్రాంతాలలో మియన్మార్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్జాతీయ సాయం కోరింది.

భూకంప కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కుప్పకూలిన ఎత్తైన భవనాల కింద నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు. రక్షణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

థాయ్‌లాండ్ భూకంపాల హాట్‌స్పాట్ కాదు. బ్యాంకాక్‌లోని ఎత్తైన భవనాలు భూకంప తీవ్రతను తట్టుకునే సాంకేతికతతో నిర్మించినవి కావు. అయితే ఎక్కువగా నిర్మాణంలోని భవనాలలోనే తీవ్రనష్టం వాటిల్లింది.

భూకంప ప్రభావిత ప్రాంతాలలో అత్యవసర దళాలతో సమన్వయం చేసుకుంటున్నామని థాయ్ ప్రభుత్వం తెలిపింది.

థాయ్ రాజధాని నడిబొడ్డున హోటళ్లు, కంపెనీలు, ఆసుపత్రులను వదిలి ప్రజలు భయం, గందరగోళంతో వీధుల్లోకి వచ్చేశారు.

సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను సిద్ధం చేశామని, సహాయక పరికరాలు, యంత్రాలను సిద్ధం చేయాలని విపత్తు కేంద్రాలను ఆదేశించినట్లు థాయ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి