Breaking News

నాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి: ఢిల్లీ హైకోర్ట్

నాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి: ఢిల్లీ హైకోర్ట్


Published on: 24 Dec 2025 19:07  IST

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతోంది. బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలకు కనీసం స్వచ్ఛమైన గాలిని కూడా అందించలేని పరిస్థితుల్లో, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయడం ఎంతవరకు న్యాయం? అని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.

ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించడం ప్రభుత్వం చేయగలిగిన కనీస బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది. అది సాధ్యం కాకపోతే, ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కొనుగోలు చేసే పరికరాలపై పన్నులు వేయడం సరికాదని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

విలాస వస్తువులు కాదు… ఆరోగ్య అవసరం

ఎయిర్ ప్యూరిఫైయర్లను లగ్జరీ వస్తువులుగా కాకుండా, వెంటనే ‘వైద్య పరికరాలు’ కేటగిరీలోకి మార్చి జీఎస్టీ నుంచి మినహాయించాలి అని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లాంటి తీవ్రమైన కాలుష్య నగరాల్లో ప్యూరిఫైయర్లను విలాస వస్తువుల జాబితాలో ఉంచడం పూర్తిగా అన్యాయమని అభిప్రాయపడింది.

“నగరమే ఊపిరాడని స్థితిలో ఉంటే, గాలి శుద్ధి పరికరాలను లగ్జరీగా ఎలా పరిగణిస్తారు?” అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది.

కాలుష్యం – ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని కోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఒక మనిషి రోజుకు సగటున సుమారు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాడని, అది మనకు తెలియకుండానే జరుగుతుందని న్యాయమూర్తులు గుర్తుచేశారు. ఇంత కలుషితమైన గాలిని రోజంతా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఎంత నష్టపోతున్నాయో ఊహించండి అంటూ వ్యాఖ్యానించారు.

ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో గాలిని శుద్ధి చేసుకునే పరికరాలు ప్రజలకు ఎంతో అవసరమని, వాటిని ఎమర్జెన్సీ అవసరాలుగా చూడాలని కోర్టు సూచించింది.

తాత్కాలికంగానైనా జీఎస్టీ మినహాయింపు పరిశీలించాలి

ప్రస్తుత కాలుష్య పరిస్థితులను ఒక ఎమర్జెన్సీగా పరిగణించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కనీసం వచ్చే వారం లేదా నెల రోజుల పాటు తాత్కాలికంగానైనా ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని మినహాయించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణలోగా స్పష్టమైన నిర్ణయాలతో కోర్టుకు రావాలని అధికారులకు సూచించింది.

ధరలు తగ్గితే ప్రజలకు ఊరట

ప్రస్తుతం మార్కెట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ల ధరలు వేల రూపాయల్లో ఉన్నాయి. వాటిపై 18 శాతం జీఎస్టీ కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు జీఎస్టీ తగ్గింపు లేదా మినహాయింపు అమలులోకి వస్తే, ధరలు తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల ఢిల్లీ వాసులకు పెద్ద ఎత్తున లాభం చేకూరడమే కాకుండా, శ్వాసకోశ సమస్యలతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.

Follow us on , &

ఇవీ చదవండి