Breaking News

భారత్‌-పాక్‌ యుద్ధంలో జోక్యం చేసుకోబోమన్న అమెరికా ఉపాధ్యక్షుడు

భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వెల్లడించారు.


Published on: 09 May 2025 11:57  IST

భారత్‌–పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పందించారు. రెండు అణుశక్తి దేశాల మధ్య సైనిక స్ధాయిలో జరుగుతున్న ఘర్షణను అమెరికా గమనిస్తోందని, కానీ యుద్ధంలో జోక్యం చేసుకునే ఆలోచన తమకు లేదని స్పష్టంగా తెలిపారు. ఫాక్స్ న్యూస్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భయంకరంగా మారే అవకాశం ఉంది. పరిస్థితులు త్వరగా స్థిరపడాలని మేం కోరుకుంటున్నాం. భారత్‌కు పాకిస్థాన్‌పై కొన్ని గాంభీర్యమైన అభ్యంతరాలు ఉన్నట్టు తెలుసు. అయితే, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నదే మా నమ్మకం. అటు ఇటు ఎవరికీ మద్దతివ్వడం లేదా యుద్ధంలో చేరడం మేము చేయం. అది మా బాధ్యత కాదు’’ అని వాన్స్‌ వివరించారు.

‘‘భారత్, పాక్ ఆయుధాలు వదిలేయాలని మేము కోరడం లేదు. కానీ సమస్యలు పరిష్కారం కావాలంటే, కమ్యూనికేషన్ తప్పనిసరి. చర్చలే పరిష్కార మార్గం. నిశ్శబ్దం వల్ల సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది’’ అని వాన్‍్స్‌ మరోసారి స్పష్టం చేశారు.

గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి ప్రవేశించిన దాదాపు 50 డ్రోన్లను భారత సైన్యం కాల్చి పడేసినట్టు సమాచారం.

ఈ పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ కూడా స్పందించారు. ‘‘ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదరకూడదు. ఇలాంటి పరిణామాలు గతంలో కూడా చూశాం. ఉగ్రదాడుల నేపథ్యంలో ఇలాంటి ఘర్షణలు కొత్తకావు. అయినా వీటిని పెంచకుండా చూడాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.

అలాగే, బ్రూస్‌ మాట్లాడుతూ ‘‘అమెరికా గత కొన్ని రోజులుగా ఇరు దేశాల్లోని కీలక నేతలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. పాకిస్థాన్ పహల్గాం దాడిపై స్వతంత్ర విచారణ కోరుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులను శిక్షించాల్సిందే’’ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి