Breaking News

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పలు చోట్ల ఉద్రిక్తత

చిత్తూరు ,అమరావతి,పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి,కడప ,అనకాపల్లి ,ఏలూరు జిల్లా లో స్థానిక సంస్థల ఎన్నికలు


Published on: 27 Mar 2025 16:07  IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ప్రధానంగా కూటమికి , వైసీపీకి మధ్య పోటీ నెలకొంది. ఇక కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి టీడీపీ కూటమి పోటీ చేయబోమని ప్రకటించడంతో, అక్కడ వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎంపీపీగా ఉన్న శాంతకుమారి మరణంతో ఈ ఎన్నిక జరుగుతోంది. 2021లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా టీడీపీకి ఒక్క ఎంపీటీసీ స్థానమూ రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి, ఎవరు ఎంపీపీగా ఎన్నిక అవుతారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీకి చెందిన నేతలు ఎంపీటీసీలతో కలిసి కారుమూరి నివాసం నుండి బయలుదేరుతుండగా, వారిని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. పోలీసులు పరిస్థితిని సమర్థవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో బీజేపీ అభ్యర్థి తేతలి సుమ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఏపీలో బీజేపీ తరఫున ఎంపీపీగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు.

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా వైసీపీ అభ్యర్థి రామగోవింద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రకటన మేరకు, ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవడంతో ఆయనను ఎన్నికైనట్లు ప్రకటించారు. టీడీపీ కూటమి ఈ పదవికి పోటీ చేయబోమని ప్రకటించడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కలెక్టర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.

అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల నారపాడులో వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది. గతంలో వైస్ ఎంపీపీగా ఉన్న చొక్కాకుల గోవింద్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ రోజు ఎన్నిక జరుగుతోంది. జనసేన అభ్యర్థి మామిడి లక్ష్మిని వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల ఎంపీపీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 14 మంది ఎంపీటీసీలలో వైసీపీకి 13 మంది, టీడీపీకి ఒకరు ఉన్నారు. అయితే, వైసీపీ నుంచి ఒకరు టీడీపీలో చేరడంతో ప్రస్తుతం టీడీపీకి ఇద్దరు, వైసీపీకి 12 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

ఏలూరు జిల్లా కైకలూరులో వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. మొత్తం 22 మంది ఎంపీటీసీలలో ఒకరు మరణించగా, మరొకరు రాజీనామా చేయడంతో 20 మంది మధ్య పోటీ నెలకొంది. టీడీపీ కూటమి, వైసీపీ  ఇరు పార్టీలకు సమానంగా 10 మంది సభ్యులు ఉండటంతో ఎన్నిక ఉత్కంఠతగా మారింది. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి