Breaking News

మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు ఐదు బిల్లులు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు (Assembly Budget Session) మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభంకానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల్లు సహా ఐదు బిల్లులను శాసన సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.


Published on: 17 Mar 2025 12:49  IST

హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు (Assembly Budget Session) మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభంకానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల్లు సహా ఐదు బిల్లులను శాసన సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక మండలిలో మాత్రం ప్రశ్నోత్తరాలకే పరిమితం కానున్నది.

శాసనసభలో మెస్ డైట్ చార్జీల పెంపు, జాతీయ రహదారుల సమీపంలో ట్రామా కేర్ కేంద్రాలు, విదేశీ ఉపకార వేతనాల చెల్లింపులో జాప్యం, కామారెడ్డి జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి, దేవాలయ పర్యాటకం, పర్యావరణ పర్యాటకాల ప్రోత్సాహం, శంకరపట్నం మండలంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ప్రభుత్వ వెబ్‌సైట్లలో జీవోలు, సర్క్యులర్లు, హెచ్ఎండీఏ భూముల తాకట్టు, మహబూబాబాద్ పట్టణం చుట్టూ రింగ్ కోసం నిధులు, టీ-ప్రైడ్ కింద రాయితీకి సంబంధించిన ప్రశ్నలు శాసనసభలో చర్చకు రానున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలు, కళ్యాణమస్తు పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీ కోసం భూసేకరణ, రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, వరి ధాన్యానికి బోనస్, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, వరి ధాన్యం సేకరణ, తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి సరఫరాపై ప్రశ్నలు మండలిలో చర్చకు వస్తాయి.

కాగా, శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ రేషనల్లైజేషన్ బిల్లును సీఎం రేవంత్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ తర్వాత బిల్లు ఆమోదం కోసం కోరనున్నారు. ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ మంత్రి పొన్న ప్రభాకర్‌ బిల్లును ప్రవేశపెడుతారు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల పెంపు బిల్లును కూడా ప్రవేశపెడుతారు. తెలంగాణ చారిటబుల్, హిందూ సంస్థల సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లును సభలో చర్చను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆయా బిల్లులపై చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి