Breaking News

తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలపై కీలక ప్రకటన

తెలంగాణలో సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధత తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉండగా.. ఈ నెల 16 లేదా 17న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు.


Published on: 12 Aug 2025 10:13  IST

తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సర్కార్‌కు డెడ్‌లైన్ విధించగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఆర్డినెస్స్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. మరోవైపు ఆశావాహులు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశాలపై చర్చించేందుకు మరో నాలుగైదు రోజులు అంటే ఈ నెల 16 లేదా 17న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని CM రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు.

సోమవారం జూబ్లీహిల్స్‌లోని CM నివాసంలో జరిగిన గంటన్నర చర్చలో ఈ కీలక అంశాలపై ఇద్దరు నేతలు సంప్రదింపులు జరిపారు. పీఏసీ సమావేశంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, MPTC ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నాయకుల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించారు. మెజారిటీ అభిప్రాయాల ఆధారంగానే ఎన్నికల నిర్వహణ, BC రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి నాయకులంతా సామూహికంగా కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు. ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులు, సమన్వయకర్తలు, గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కలిసి పనిచేసేలా చూడాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి