Breaking News

తమిళనాడు సీఎం, డీఎంకే నాయకుడు స్టాలిన్ ఉత్తరప్రదేశ్ యోగి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు.

తమిళనాడు ఏ భాషను వ్యతిరేకించదని, బలవంతంగా ప్రజలపై త్రిభాషా విధానాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న మీ దురహంకార వైఖరినే మా పోరాటమని స్పష్టం చేశారు.


Published on: 27 Mar 2025 18:52  IST

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో డీఎంకే నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రాంతీయతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల ముందు ఓటు బ్యాంకు కోల్పోతామన్న భయంతోనే భాషా, ప్రాంతీయ విభేదాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సంస్కృతం తర్వాత అత్యంత పురాతనమైన భాషగా తమిళాన్ని గౌరవిస్తున్నాం, కానీ హిందీని ద్వేషించడమేంటి? అంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలు బోధిస్తున్నప్పుడు, తమిళనాడులో హిందీ బోధనను వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. హోంమంత్రి ఇప్పటికే త్రిభాషా విధానంపై స్పష్టంగా మాట్లాడిన తర్వాత, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వివాదంగా మార్చడం తగదని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (NEP) లోని త్రిభాషా విధానాన్ని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తోంది. 2026 తర్వాత డీలిమిటేషన్ అమల్లోకి వస్తే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలేనని వాదిస్తోంది. గతంలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసి, దేశ ఆర్థిక పురోగతికి దోహదపడ్డందుకు ఫలితంగా దక్షిణాది వారికి పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గడమే బహుమానంగా లభిస్తోందని ఎండగట్టింది. 

ఈ వివాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. "రెండు భాషలు, డీలిమిటేషన్ వంటి కీలక అంశాల్లో తమిళనాడు అభిప్రాయాన్ని దేశవ్యాప్తంగా చాలా మంది సమర్థిస్తున్నారు.బీజెపి పార్టీ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో యోగి ఆదిత్యనాథ్ మాకు ద్వేషం గురించి ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నారా? మమ్మల్ని వదిలేయండి. ఇది వ్యంగ్యం కాదు, పొలిటికల్ బ్లాక్ కామెడీ చీకటి దశలో ఉంది. మేము ఏ భాషను వ్యతిరేకించము. కానీ బలవంతంగా రుద్దడాన్ని సహించం. ఇది ఓట్ల కోసం అల్లర్లు సృష్టించేందుకు చేసే రాజకీయాలు కాదు. గౌరవం, న్యాయం కోసం జరుగుతున్న యుద్ధం" అని స్టాలిన్ స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి