Breaking News

పవన్‌ కల్యాణ్‌ కేసును ప్రత్యేక కోర్టుకు పంపాల్సిన అవసరం ఏమిటి?

పవన్‌ కల్యాణ్‌ కేసు పై హైకోర్టులో కె.సరళ మరో ముగ్గురు క్రిమినల్‌ రివిజన్‌ కేసు దాఖలు చేశారు.


Published on: 02 Apr 2025 10:29  IST

పవన్‌ వాలంటీర్లపై వ్యాఖ్యలు – హైకోర్టు విచారణ

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల విషయంలో హైకోర్టు ఆసక్తికర ప్రశ్నలను సంధించింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన వారాహి యాత్రలో మాట్లాడుతూ, వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లి మహిళల అపహరణలకు దారి తీస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, గత ఏడాది ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసింది.

తాజాగా, ఆ కేసు సంబంధంగా ఐదుగురు వాలంటీర్లు అఫిడవిట్‌లు సమర్పిస్తూ, వైఎస్సార్సీపీ నాయకులు తమ నుంచి సంతకాలు తీసుకొని కోర్టులో పిటిషన్‌ వేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌పై నడుస్తున్న కేసును ఉపసంహరించుకోవాలని గుంటూరు కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పిటిషన్‌ వేశారు. విచారణ తర్వాత, గత ఏడాది నవంబర్ 18న కోర్టు ప్రాసిక్యూషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతిచ్చింది.

అయితే, ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కె. సరళ, మరొక ముగ్గురు హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం జరిగిన విచారణలో, వారి తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ ప్రజాప్రతినిధి అయినందున, ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరారు.

ఈ వాదనపై హైకోర్టు న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేస్తూ, “పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా? అలాంటప్పుడు, ఈ కేసును ప్రత్యేక కోర్టుకు పంపాల్సిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు. తదుపరి వాదనలు వినిపించేందుకు విచారణను వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి