Breaking News

సిగాచి’ దుర్ఘటన.. ఇన్‌స్పెక్షన్ రిపోర్టులో భయంకర నిజాలు

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న 'సిగాచి’ ఫార్మా పరిశ్రమ దుర్ఘటన.. ఇన్‌స్పెక్షన్ రిపోర్టులో భయంకర నిజాలు..


Published on: 09 Jul 2025 09:19  IST

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరనిలోటు కలిగించింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంకా 8 మంది మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 12న రాష్ట్ర కర్మాగారాల శాఖ అధికారులు ఈ పరిశ్రమపై తనిఖీ నిర్వహించారు. అప్పుడు తయారైన నివేదిక ఇటీవల వెలుగులోకి రావడంతో, ఈ పరిశ్రమలో ఉన్న భద్రతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిగాచి కంపెనీలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్, పౌడర్డ్ సెల్యులోజ్ వంటివి తయారవుతుండగా, మొత్తం 197 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 110 మంది రెగ్యులర్, 87 మంది కాంట్రాక్ట్ వర్కర్లు.

అయితే ఆ పరిశీలనలో అధికారులు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు గమనార్హంగా మారాయి. పరిశ్రమ యాజమాన్యం భద్రతా నిబంధనలు పాటించడంలో తీవ్రమైన అలసత్వం చూపిందని నివేదిక స్పష్టం చేస్తోంది. కార్మికులు పనిచేసే గదులలో సరైన మార్గాలు లేకుండా యంత్రాలు అమర్చినట్లు గుర్తించారు. ఇండస్ట్రియల్ భద్రతా చట్టంలోని సెక్షన్ 38, రూల్ నంబర్ 61 ప్రకారం, కార్మికులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా బయటకు వెళ్లే మార్గాలు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వెనుకబడిన భద్రతా ఏర్పాట్లతో పాటు, పరిశ్రమలో ఎమర్జెన్సీ సందర్భాల్లో ఉపయోగించాల్సిన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేకపోవడం, విద్యుత్ వైరింగ్ ఎలాంటి నియమాలు పాటించకుండా వేసినట్లు పేర్కొన్నారు. దీనికితోడు, కార్మికులు అత్యవసరంగా బయటకు వెళ్లే మార్గాలు ఎక్కడున్నాయో చూపించే బోర్డులు (ఇల్యూమినేటెడ్ మార్కింగ్‌లు) సైతం లేవని నివేదిక వెల్లడించింది.

ఇటీవల జరిగిన పేలుడు ప్రమాదం వెనుక ఈ భద్రతా లోపాలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడే స్థాయిలో పరిశ్రమను నడపడం, ప్రభుత్వ శాఖల సూచనలు పట్టించుకోకపోవడం – ఇవన్నీ కలిపి ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీశాయి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి