Breaking News

క్యాప్స్ గోల్డ్ కేసు: ఐటీ శాఖ దూకుడు – కోట్ల విలువైన డాక్యుమెంట్లు, బంగారం స్వాధీనం

క్యాప్స్ గోల్డ్ కేసు: ఐటీ శాఖ దూకుడు – కోట్ల విలువైన డాక్యుమెంట్లు, బంగారం స్వాధీనం


Published on: 20 Sep 2025 10:08  IST

క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నాలుగో రోజుకూ కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, ముంబయి నగరాల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీ యజమానులు, వారి బంధువుల ఇళ్లలో తనీఖీలు జరిపి పలు ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం ప్రకారం, క్యాప్స్ గోల్డ్ ఈ ఏడాదిలోనే 20 వేల కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల నగదు, బంగారం బిస్కెట్లు స్వాధీనం అయినట్లు తెలుస్తోంది. అంతేకాక, బ్యాంక్ లాకర్లను సైతం పరిశీలిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లను హ్యాకర్ల సాయంతో ఓపెన్ చేసి డేటా సేకరిస్తున్నారు.

ట్యాక్స్ చెల్లింపులపై ఇప్పటికే కంపెనీ డైరెక్టర్ చందా సుధీర్‌ను అధికారులు విచారించగా, ఈ రోజు మరో డైరెక్టర్ చందా శ్రీనివాసును ప్రశ్నించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గత మూడు రోజులుగా ప్రముఖ బంగారం వ్యాపారుల ఇళ్లలోనూ ఐటీ దాడులు జరగడం వల్ల బంగారం వ్యాపార రంగం ఉలిక్కిపడింది.

ఐటీ అధికారులు అనుమానిస్తున్న విషయాల్లో ప్రధానంగా – పన్ను ఎగవేత, బ్లాక్ మార్కెట్‌ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేయడం, లావాదేవీల్లో అవకతవకలు ఉన్నాయి. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి వాసవి రియల్ ఎస్టేట్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించడంతో, ఆ సంస్థ యజమానుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.

ప్రస్తుతం క్యాప్స్ గోల్డ్‌కు చెందిన చైర్మన్, డైరెక్టర్ల ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన ఐటీ అధికారులు, భారీ స్థాయిలో పన్ను ఎగవేత జరుగుతున్నట్లు గుర్తించారు. రాబోయే రోజుల్లో ఈ దాడులు ఇంకా విస్తరించే అవకాశం ఉందని సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి