Breaking News

హైడ్రోజన్‌ బాంబును 1000 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను వెలువరిస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించగలదు.

ఈ పరీక్ష, అణ్వస్త్రాల తరహాలో పేలుడు తీవ్రతను కలిగించినప్పటికీ, తదనంతర రేడియేషన్‌ దుష్పరిమాణాలు లేవని చెబుతున్న చైనా.


Published on: 21 Apr 2025 11:15  IST

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: చైనా ఒక శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించి విజయవంతమైందని సమాచారం. ఈ బాంబు అణు బాంబుల్లా కాకుండా, సాధారణ బాంబులుగా ఉంటూ కూడా భారీ విధ్వంసాన్ని కలిగించేలా రూపొందించబడింది.ఈ బాంబు పేలిన సమయంలో 1000 డిగ్రీల సెల్సియస్‌కు మించిపోయే ఉష్ణోగ్రతలు ఉత్పత్తి అవుతాయని, అది కొన్ని సెకన్లపాటు పెద్ద అగ్నిగోళంగా మారుతుందని సమాచారం. అల్యూమినియం అల్లాయ్ వంటి లోహాలే కరిగిపోయేంత వేడిని విడుదల చేస్తుందని చెబుతున్నారు.ఈ బాంబును "705 రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్" అనే సంస్థ, చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్‌కు చెందిన సంస్థ రూపొందించింది. ఇందులో రెండు కిలోల మెగ్నీషియం హైడ్రైడ్ అనే పదార్థాన్ని ఉపయోగించి పేలుడు పరీక్ష నిర్వహించారు.పేలుడు సమయంలో హైడ్రోజన్‌ వాయువు ఆక్సిజన్‌తో కలిసి ఒక రసాయన చర్య జరుగుతుంది. ఈ చర్యలో నీరు ఏర్పడుతుండగా, పెద్ద స్థాయిలో వేడి విడుదలవుతుంది. హైడ్రోజన్‌ నుంచి వచ్చే ఈ అధిక ఉష్ణోగ్రతన్ని వినియోగించి బాంబు తయారీకి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.అయితే ఎక్కువ హైడ్రోజన్‌ను ఒకే చోట నిల్వ చేయడం తేలిక కాదు. దాన్ని భారీ ఒత్తిడితో ప్రత్యేక ట్యాంకుల్లో భద్రపరచాలి, ఇది సాధ్యపడటం కష్టమే. ఈ సమస్యకు పరిష్కారంగా చైనా శాస్త్రవేత్తలు మెగ్నీషియం హైడ్రైడ్ అనే పదార్థాన్ని వినియోగించి ఒక ప్రయోగాత్మక బాంబును రూపొందించారు.

ఈ బాంబు పేలిన వెంటనే, మెగ్నీషియం హైడ్రైడ్ పొడి చుట్టూ వ్యాపిస్తుంది. పేలుడుతో ఏర్పడిన వేడి కారణంగా కొంత మెగ్నీషియం హైడ్రైడ్ విచ్ఛిన్నమై హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. ఆ వాయువు వెంటనే అంటుకొని మళ్లీ వేడి విడుదల చేస్తుంది. ఈ చర్య వరుసగా జరిగి బాంబులోని మెటీరియల్ అంతా పూర్తిగా మండిపోయే వరకు కొనసాగుతుంది. ఫలితంగా కొన్ని సెకన్లపాటు వెయ్యి డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతతో అగ్ని గోళంలా మారుతుంది.వాస్తవానికి మెగ్నీషియం హైడ్రైడ్‌ను మొదట శక్తి ఉత్పత్తి కోసం అభివృద్ధి చేశారు. వేడి ఇచ్చినప్పుడు ఇది హైడ్రోజన్‌ను విడుదల చేస్తుంది, దాన్ని ఇంధనంగా ఉపయోగించవచ్చు. కానీ ఇప్పుడు అదే పదార్థం విధ్వంసకర బాంబుల తయారీలో ఉపయోగపడుతోంది.

సాధారణంగా బాంబుల తయారీలో టీఎన్‌టీ (ట్రై నైట్రో టోలిన్‌) అనే పదార్థాన్ని పేలుడు కోసం ఉపయోగిస్తారు. కానీ దీని సామర్థ్యంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కువ విధ్వంసం కావాలంటే పెద్ద మొత్తంలో టీఎన్‌టీ అవసరం అవుతుంది.ఈ పరిమితిని దాటి భారీ ధ్వంసం కలిగించే ఆయుధాలు అవసరమవడంతోనే అణు బాంబులు అభివృద్ధి అయ్యాయి. అయితే, అణ్వస్త్రాల వల్ల కలిగే తీవ్రమైన శక్తి తో పాటు రేడియేషన్ వలన తలెత్తే పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ప్రభావాలు పెద్ద చర్చకి కారణమయ్యాయి.దీని నేపథ్యంలో, తీవ్ర విధ్వంసం కలిగించే సామర్థ్యం ఉన్నప్పటికీ రేడియేషన్ లాంటి దుష్పరిణామాలు లేని బాంబుల అభివృద్ధి వైపుగా పెద్ద దేశాలు దృష్టి సారించాయి. ఇప్పటికే రష్యా, అమెరికా ఈ తరహా ఆయుధాలపై ప్రయోగాలు జరిపి ఉన్నాయి. తాజాగా చైనా కూడా అలాంటి ఓ శక్తివంతమైన బాంబును విజయవంతంగా పరీక్షించింది.

Follow us on , &

ఇవీ చదవండి