Breaking News

కరోనా భయపెడుతోంది.. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలు చెప్తున్నాయి.


Published on: 20 May 2025 08:21  IST

దేశంలో కరోనా మళ్లీ తన ప్రభావాన్ని చూపుతోంది. గత కొద్ది రోజులుగా యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క వారం వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్నది. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కొత్త కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ కూడా అప్రమత్తమైంది. ఇదే తరుణంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్ర అప్రమత్తత చూపుతోంది. పరిస్థితిని బాగానే పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది.. దేశంలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో భయం అవసరం లేదని స్పష్టంచేసింది.

భారత్‌లో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) నేతృత్వంలో ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఇందులో NCDC, EMR విభాగం, ICMR, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ తదితర సంస్థల నిపుణులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) పని చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు చాలా తక్కువ తీవ్రత కలవిగా ఉన్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రావడం లేదని వెల్లడించారు.

కొవిడ్-19 కొత్త వేరియంట్ అయిన JN.1 నేపథ్యంలో కొన్ని లక్షణాలు చూస్తున్నారు. ఈ వేరియంట్‌ వల్ల రోగుల్లో జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ లక్షణాలు తీవ్రమైనవిగా లేవని, సాధారణ జాగ్రత్తలు పాటిస్తే చాలు అని వైద్య నిపుణులు అంటున్నారు.

ప్రజలకు సూచనలు:

  • హైజిన్ పాటించాలి

  • జ్వరము, దగ్గు, శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి

  • అవసరమైతే మాస్క్‌ వాడాలి

  • గుంపుగా చేరే ప్రాంతాలకు దూరంగా ఉండాలి

ప్రస్తుతం దేశంలో పరిస్థితి నియంత్రణలో ఉన్నా, ప్రాథమిక జాగ్రత్తలు పాటించడంలో ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి