Breaking News

ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, రహదారుల విస్తరణకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

హైదరాబాద్ నగరంలో వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలను తొలగించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది.


Published on: 24 Mar 2025 11:30  IST

హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. ఎక్కడ రహదారులను విస్తరించాలి, ఎన్ని నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది అనే అంశాలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సర్వే ప్రక్రియ పూర్తయిన వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించి పనులు ప్రారంభించనున్నారు. నగరంలో వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలను తొలగించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది.

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ రహదారుల్లో ఒకటిగా ఉన్న హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి సైబర్‌టవర్స్‌ రోడ్డు వరకు విస్తరణ చేపట్టనున్నారు. ఎన్‌ఐఏ భవనం నుంచి సైబర్‌టవర్స్‌ ఫ్లైఓవర్ వరకు రోడ్డును 120 అడుగుల మేర విస్తరించేందుకు సిద్ధమయ్యారు.ఈ పనులు వచ్చే నెలలో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఓల్డ్ సిటీలో బెంగళూరు జాతీయ రహదారి నుంచి శాస్త్రిపురం జంక్షన్ వరకు అక్కడి నుంచి ఇంజిన్ బౌలి వరకు రహదారిని 100 అడుగుల మేర విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి గాను రూ.543 కోట్ల ఖర్చవుతుందని జీహెచ్‌ఎంసీ అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఒకటి నుంచి రోడ్ నెంబర్ పన్నెండు మీదుగా జూబ్లీ చెక్ పోస్టు వరకు రహదారి విస్తరణకు ప్రణాళిక రూపొందించారు. ఈ పనుల కోసం మొత్తం 306 ఆస్తులను భూసేకరణ చేయాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే వేగంగా సాగుతోంది.

కొండాపూర్లో మజీద్ బండ నుంచి హెచ్ సీయూ రహదారిని కలిపే రోడ్లను 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ట్రిపుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో జంక్షన్ మధ్య ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి నియోపొలిస్‌ వద్ద రింగురోడ్డును కనెక్ట్ చేస్తూ పైవంతెన నిర్మాణానికి  ప్రణాళికలు సిద్ధం చేశారు. 

చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ నుంచి బార్కస్, బాలాపూర్ మెయిన్ రోడ్ నుంచి మలక్‌పేట సోయెబ్ హోటల్, నక్రీపూల్ బాగ్ నుంచి జీహెచ్ ఎంసీ జోనల్ ఆఫీస్ వరకు రహదారులను విస్తరించనున్నారు. తులసినగర్ నుంచి గౌస్ నగర్ వరకు రహదారి విస్తరణకు రూ 320 కోట్ల వ్యయం అంచనా వేయబడింది.

ఈ రహదారి విస్తరణ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నగరవాసులకు ట్రాఫిక్ సమస్యల నుంచి పరిష్కారం లభించనుంది. 

Follow us on , &

ఇవీ చదవండి