Breaking News

జీఎంహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

జీఎంహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం


Published on: 09 Dec 2025 10:29  IST

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగర పాలనలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇటీవల హైదరాబాద్ నగర పరిధిని విస్తరిస్తూ పక్కనున్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. నగరం విస్తరించడంతో పాటు జనాభా గణనీయంగా పెరగడంతో పాలన మరింత సమర్థంగా సాగాలన్న ఉద్దేశంతో వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో వార్డు రీఆర్గనైజేషన్‌పై ప్రత్యేక అధ్యయనం చేపట్టారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో 27 పట్టణ స్థానిక సంస్థల డేటాను పరిశీలించి, జనాభా పంపిణీ, పట్టణ విస్తీర్ణం, పరిపాలనా అవసరాలను బట్టి ఒక నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్తగా 300 వార్డులను ఖరారు చేసింది.

ఈ నిర్ణయం జీహెచ్ఎంసీ చట్టం–1955లోని సెక్షన్ 5, సెక్షన్ 8 నిబంధనల ప్రకారం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గెజిట్ నోటిఫికేషన్‌ను ముద్రించి సంబంధిత విభాగాలకు పంపేందుకు ముద్రణ శాఖకు 500 ప్రతులు అందించాలని సూచనలు ఇచ్చింది.

వార్డుల పునర్విభజన ప్రక్రియ భవిష్యత్తులో జరగనున్న జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది. గెజిట్ విడుదలైన తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించిన అనంతరం అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఈ మార్పుతో నగర పాలన మరింత ప్రజలకు దగ్గరగా ఉండటంతో పాటు, పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి