Breaking News

భారత్–అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు సడలనున్నాయా? టారిఫ్‌ తగ్గింపుపై చర్చలు వేగం

భారత్–అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు సడలనున్నాయా? టారిఫ్‌ తగ్గింపుపై చర్చలు వేగం


Published on: 22 Oct 2025 12:53  IST

గత కొద్ది నెలలుగా భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో అమెరికా టారిఫ్‌ యుద్ధాన్ని ప్రారంభించింది. మొదట 25 శాతం సుంకాలు విధించగా, తరువాత మరో 25 శాతం పెంచింది. దీంతో ప్రస్తుతం భారత ఎగుమతులపై అమెరికాలో మొత్తం 50 శాతం టారిఫ్‌లు అమల్లో ఉన్నాయి.

అయితే ఈ ఉద్రిక్తతలకు త్వరలో తెరపడే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని, కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత ఎగుమతులపై సుంకాలు గణనీయంగా తగ్గబోతున్నాయని సమాచారం. ప్రస్తుత 50 శాతం టారిఫ్‌ 15 నుంచి 16 శాతానికి తగ్గే వీలుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 30 తర్వాత ఈ కొత్త రేట్లు అమల్లోకి రావచ్చని చెబుతున్నారు.

ఈ ఒప్పందం కోసం భారత్‌ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను కొంత మేర తగ్గించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతం భారత్‌ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 34 శాతం ఉంది. దాన్ని దశలవారీగా తగ్గించడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇక మరోవైపు, చైనా ఇటీవల అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులను తగ్గించడంతో, అమెరికా కొత్త మార్కెట్ల కోసం భారత్‌పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న, సోయామీల్ దిగుమతులను భారత్‌లో అనుమతించే అవకాశాలు ఉన్నాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

ఈ చర్చలు విజయవంతమైతే, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు కొత్త దిశలో సాగి, రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఊతమివ్వనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి