Breaking News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మూడు పార్టీల ఫోకస్ – రాజకీయంగా వేడెక్కుతున్న వాతావరణం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మూడు పార్టీల ఫోకస్ – రాజకీయంగా వేడెక్కుతున్న వాతావరణం


Published on: 29 Sep 2025 09:43  IST

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజకీయ హాట్‌స్పాట్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత ఖాళీ అయిన ఈ సీటు కోసం అన్ని ప్రధాన పార్టీలూ తమ బలాన్ని పరీక్షించుకునే సన్నాహాల్లో పడ్డాయి. ఈ నియోజకవర్గం ప్రాధాన్యం దృష్ట్యా, రాబోయే ఉపఎన్నికలతో పాటు తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే పోరాటంగా ఈ ఎన్నికను భావిస్తున్నారు.

కాంగ్రెస్ దూకుడు

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. బస్తీల్లో తిరిగి, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, క్యాడర్‌ని చురుకుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థి ఎంపికలో కొంచెం ఆలస్యమైనా, అభివృద్ధి అంశాలతో ఓటర్లను ఆకర్షించగలమనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. “లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం” అన్న ధీమా కాంగ్రెస్లో కనిపిస్తోంది.

బీజేపీ వ్యూహం

బీజేపీ అయితే ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బూత్‌లెవల్ కమిటీలతోనే కాకుండా, ఇంటింటికీ చేరి ప్రతి ఓటరుని కలిసేలా వ్యూహాలు రచిస్తోంది. పార్టీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, “ప్రజాబలమే మా బలం. ఎంఐఎం మద్దతుతో కాకుండా ప్రజలతోనే మేము గెలుస్తాం” అని వ్యాఖ్యానించారు. హిందూ ఓటర్ల మద్దతుతో జూబ్లీహిల్స్ విజయం సాధిస్తే, తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యమని బీజేపీ భావిస్తోంది.

బీఆర్‌ఎస్ ధీమా

బీఆర్‌ఎస్ నేతలు మాత్రం అర్బన్ ఓటర్లు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు తమవైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. షేక్‌పేట్‌లో ప్రచారం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు కేవలం టూరిస్టులు. ఎన్నికలయ్యాక వారిని ఎవరూ చూడరు. ఈసారి మాగంటి సునీత గెలుపు ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషన్ సిద్ధత

ఇక ఉపఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ కూడా సన్నాహాలు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో జరగబోయే ఉపఎన్నికలకు 470 మంది పరిశీలకులను నియమించింది. ఇందులో జూబ్లీహిల్స్ కూడా ఒక ముఖ్యమైన నియోజకవర్గం. త్వరలోనే ఉపఎన్నిక తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి