Breaking News

మహారాష్ట్రలోని వర్వాండి గ్రామంలో ఒక రైతు పొలంలో భారీ బాంబు ...?

సుమారు 4.5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్నా బాంబు మహారాష్ట్రలోని వర్వాండి గ్రామంలో ఒక రైతు పొలంలో తవ్వకాల్లో బయటపడింది.


Published on: 02 May 2025 19:11  IST

మహారాష్ట్రలోని వర్వాండి గ్రామంలో ఒక రైతు పొలంలో తవ్వకాల్లో భారీ బాంబు బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాజేంద్ర ధాగే అనే రైతు తన పొలంలో పైపులు మరమ్మతు చేయిస్తున్న సమయంలో నేలలో ఊహించని విధంగా బాంబు పిన్‌ కనిపించింది. వెంటనే ఆయన ఈ విషయాన్ని మార్చి 28న స్థానిక రెవెన్యూ అధికారికి తెలిపాడు.

సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తవ్వకాల్లో మట్టిలో 453 కిలోల బరువున్న భారీ పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించడంతో, ఆ ప్రాంతానికి జనాన్ని ఖాళీ చేశారు.

కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత, పుణె నుంచి 10 మంది ఆర్మీ, వైమానిక దళాధికారుల బృందం వర్వాండికి చేరుకుంది. సుమారు నెల రోజుల పాటు జేసీబీ సహాయంతో ఏడడుగుల లోతు గోతిని తవ్వి, అత్యంత జాగ్రత్తగా బాంబును బయటకు తీశారు. అనంతరం, బాంబు స్కాడ్‌ బృందం అది పేలకుండా సురక్షితంగా నిర్వీర్యం చేసింది.

ఈ బాంబు సుమారు 4.5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉండగా, దాన్ని ప్రత్యేక వాహనంలో కేకే రేంజ్‌కు తరలించారు. బాంబును తరలించే సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు అధికారులు వెల్లడించారు.

బాంబు పేలుంటే పరిసరాల్లోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యేవని, భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని అధికారులు పేర్కొన్నారు. రైతు అప్రమత్తత వల్ల పెద్ద విషాదం నివారించబడిందని అతడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఈ బాంబు అక్కడికి ఎలా వచ్చింది అన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి