Breaking News

గోగుండ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌లున్నట్టు సమాచారం శుక్రవారం రాత్రి భారీ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు

ఈ ఏడాది మూడు నెలల్లోనే వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 130 మందికిపైగా మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఒక్క బస్తర్ ప్రాంతం (బిజపుర సహా ఏడు జిల్లాలు)లోనే 116 మంది చనిపోయారు. గతవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.


Published on: 29 Mar 2025 17:39  IST

దండకారణ్యంలో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ – 20 మంది మావోయిస్టుల మృతి

దండకారణ్యంలో మావోయిస్ట్‌ల కంచుకోటకు బీటలు వారుతున్నాయి. గతేడాది లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి వరుస ఎన్‌కౌంటర్‌లలో వందల మంది మావోయిస్ట్‌లు చనిపోయారు. 2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శపథం చేశారు. ఇందుకు అనుగుణంగా మావోల ఏరివేత కొనసాగుతోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ స్థావరాలపై మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ ఏడాదిలో మొదటి మూడు నెలల్లోనే పలు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇంకా మరిన్ని మృతులు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఎన్‌కౌంటర్ వివరాలు

శనివారం ఉదయం కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొగుండ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) మరియు సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.

మావోయిస్టుల సంచారంపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శుక్రవారం రాత్రి కూంబింగ్ నిర్వహించాయి. అయితే, మావోయిస్టులు వారిని గుర్తించి కాల్పులు ప్రారంభించడంతో, భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ అక్కడికక్కడే హతమయ్యారని, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో డీఆర్జీకి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

భారీగా స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో:
ఏకే-47 రైఫిల్స్ ,సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLR), ఇన్సాస్ రైఫిల్స్, 303 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు, పేలుడు పదార్థాలు ఉన్నాయని వివరించారు.అధికారులు ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి