

ఉగ్రవాదుల్ని సమరయోధులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్.
పాక్ ఉపప్రధాని మరియు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్ లో ఏప్రిల్ 22న పహల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడి సంబంధించిన ఉగ్రవాదులను స్వాతంత్య్ర సమరయోధులు"గా అభివర్ణించడం తీవ్ర విమర్శలకు గురైంది
Published on: 25 Apr 2025 13:53 IST
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లోయలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన బైసరాన్ ప్రాంతంలో పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు విచక్షణ లేకుండా కాల్పులకు దిగారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. భారత్ ఈ దాడిని తీవ్రంగా ఖండించడమే కాక, త్వరలోనే దానికి తగిన ప్రతీకారం ఉంటుంది అని హెచ్చరించింది.
ఇలాంటి సమయంలో, పాకిస్థాన్ వైఖరి మరోసారి విమర్శలకు తావిస్తోంది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన పాక్, దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రం "స్వాతంత్య్ర సమరయోధులు"గా అభివర్ణించడం తీవ్ర విమర్శలకు గురైంది.
ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో పాక్ ఉపప్రధాని మరియు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, "ఏప్రిల్ 22న పహల్గాం జిల్లాలో దాడులు చేసిన వారు స్వాతంత్య్ర యోధులై ఉండవచ్చు" అనే వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలతో పాక్ అసలు మనస్తత్వం మరోసారి ప్రపంచం ముందు వెలుగు చూసింది.
అంతేకాక, భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన అంశంపై కూడా ఇషాక్ దార్ స్పందించారు. ఈ నిర్ణయం ఏకపక్షమైందని, దానికి తాము కచ్చితంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.