Breaking News

హిందూ దేవుళ్లపై కామెంట్‌ చేస్తే గతి ఏంటనేది తెలియాలి..

హిందూ దేవుళ్లపై కామెంట్‌ చేస్తే గతి ఏంటనేది తెలియాలి..


Published on: 20 Nov 2025 19:06  IST

మహేశ్‌బాబు–రాజమౌళి కలిసి రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి హనుమంతుడిపై చెప్పిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రీయ వానరసేన రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ రాజమౌళిపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ దేవతలపై విశ్వాసం లేదని చెప్పుకుంటూ, అదే దేవతల ఆధారంగా సినిమాలు తీసి భారీగా సంపాదించడం ఎలా న్యాయం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాజా సింగ్ ఒక వీడియో విడుదల చేశారు.

రాజా సింగ్ మాట్లాడుతూ— “రాజమౌళి తల్లిదండ్రులకు హనుమంతుడిపై విశ్వాసం ఉందని చెబుతున్నాడు, కానీ తనకు అలాంటిదేమీ లేదని అంటున్నాడు. అయితే హిందూ పౌరాణిక కథలతో సినిమాలు తీసి కోట్ల రూపాయలు సంపాదించడం ఏమిటి?” అని ప్రశ్నించారు.

అలాగే ‘వారణాసి’ చిత్ర ప్రమోషన్ కోసమేనా ఈ వ్యాఖ్యలు చేశారో, లేక నిజంగానే నాస్తికుడినని చెప్పాలనుకుంటున్నాడో స్పష్టత ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. గతంలో కూడా రాజమౌళి హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

బాహుబలి సినిమాలో శివలింగం ఎత్తించే సన్నివేశం ద్వారా ప్రజాదరణ పొందినా, తరువాత దేవతలపై విశ్వాసం లేదని చెబుతుండటం విరుద్ధమని వ్యాఖ్యానించారు. అంతేకాక, శ్రీకృష్ణుడి కథలోని మహిళల గురించి, శ్రీరాముడి పాత్ర గురించి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.

ఇలాంటి వ్యాఖ్యలపై హిందూ సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని రాజా సింగ్ సూచించారు. దేవుళ్లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి సినిమాలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

“ఇలాంటి వ్యక్తుల సినిమాలు చూడడం వలన వాళ్లు మరింత ధైర్యంగా దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తారు. అందుకే ఇలాంటి దర్శకులను ప్రజలు నిరసించాలి” అంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి