Breaking News

తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వతంత్రంగా ఉపాధి ఏర్పరచుకోవడానికి రాయితీ రుణాలను అందించనుంది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకి స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు రాజీవ్ యువ వికాసం పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది.


Published on: 11 Apr 2025 19:13  IST

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకి స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు రాజీవ్ యువ వికాసం పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో స్వతంత్రంగా ఉపాధి ఏర్పరచుకోవడానికి అవసరమైన రాయితీ రుణాలను అందించనుంది. గరిష్టంగా రూ.4 లక్షల వరకు రుణ సాయం లభించనుంది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ పథకానికి ఆసక్తితో దరఖాస్తు చేస్తున్నారు.

ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు దాదాపు రూ.6వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించి, సుమారు 5 లక్షల మందికి రుణాలు మంజూరు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. 21 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షల లోపు ఉండాలి, పట్టణాల్లో అయితే అది రూ.2 లక్షల లోపు ఉండాలి.

ఇదే సందర్భంలో గ్రామీణ ప్రాంత యువత వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేయడానికీ ఈ పథకం ద్వారా రుణ సాయం అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యవసాయ శాఖ ఇప్పటికే వివరాలను అందించి, అవసరమైన యంత్రాల జాబితాను సిద్ధం చేసింది. ఇందులో డ్రోన్లు, చిన్న ట్రాక్టర్లు, రొటోవేటర్లు, ప్యాడిబేలర్లు, బూమ్ స్ప్రేయర్లు, సీడ్ ఫెర్టిలైజర్ డ్రిల్లులు, నాగళ్లు, మల్చింగ్ మెషిన్లు తదితర ఆధునిక పరికరాలు ఉన్నాయి.

వ్యవసాయంపై ఆధారపడి జీవించే గ్రామీణ యువతకు ఇది గొప్ప అవకాశమని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు తెలిపారు. సాగు సీజన్ సమయంలో అవసరమైన ఈ యంత్రాల కోసం ఇప్పటికే అనేక దరఖాస్తులు వచ్చాయని, ఈ పథకం ద్వారా వారికి గణనీయమైన సాయం అందుతుందని స్పష్టంగా చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి