Breaking News

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో తాజాగా మరో మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.

మిగతా ఆరుగురి జాడ కోసం 32వ రోజు కూడా అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మట్టి, నీరు, TBM శకలాల తరలింపు పనుల్లో రెస్క్యూ సిబ్బంది మరింత వేగం పెంచారు.


Published on: 25 Mar 2025 11:31  IST

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదంలో మరో మృతదేహం గుర్తింపు

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది తవ్వకాలు చేపట్టే సమయంలో కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో దుర్వాసన వస్తున్నట్లు గుర్తించడంతో, ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే, ఈ మృతదేహానికి సంబంధించిన అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. కొద్దిసేపటి క్రితమే అధికారులు టన్నెల్‌లోకి ప్రవేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, మృతదేహం ఆనవాళ్లు కనిపించిన స్థలంలో తవ్వకాలు పూర్తి అయితే, సాయంత్రానికల్లా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం చోటు చేసుకొని ఇప్పటికే నెల రోజులు పూర్తయ్యింది. గత నెల 22న జరిగిన ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన రెస్క్యూ టీంలను రంగంలోకి దించారు.

  • ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సింగరేణి బృందాలు,

  • ర్యాట్ హోల్ మైనర్స్, కేరళ కేడావర్ డాగ్ స్క్వాడ్ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

అయితే, గత 15 రోజుల క్రితం మాత్రమే గురుప్రీత్ సింగ్ అనే కార్మికుడి మృతదేహం బయటపడింది. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా, మిగిలిన కార్మికుల ఆచూకీ దొరకలేదు. టన్నెల్ లోపల పరిస్థితులు ప్రమాదకరంగా మారాయని అధికారులు వెల్లడించారు.

  • భారీగా మట్టి పేరుకుపోవడం,

  • నీటి ఊటలు ఏర్పడటం వంటి కారణాల వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ప్రమాదానికి సంబంధించిన కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన కేవలం 7 నిమిషాల్లోనే అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.
కనీసం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సహాయక బృందాలు నిరంతరం తవ్వకాలు కొనసాగిస్తున్నాయి.

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం సమీక్ష

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయ చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • టన్నెల్ పైకప్పు బలహీనంగా ఉందని, కూలిపోయే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

  • మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

ప్రస్తుతం గ్యాస్ కట్టర్ల సాయంతో కన్వేయర్ బెల్ట్ శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రెస్క్యూ ఆపరేషన్‌ కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై నిపుణుల బృందం ఆలోచిస్తోంది.

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రెండు ప్రధాన వ్యూహాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకటి, కొండపైభాగం నుంచి బ్లాస్టింగ్ చేసి కొత్త మార్గాన్ని D ఆకారంలో బైపాస్‌ రూట్‌ తవ్వడం. దీని ద్వారా ఒక బైపాస్ సొరంగాన్ని రూపొందించవచ్చని భావిస్తున్నారు. అయితే, దీనికోసం కొండపై నుంచి 500 మీటర్ల ఎత్తు వరకు, దాదాపు ఒక కిలోమీటర్ మేర తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్రణాళికను అమలు చేయడానికి అటవీ శాఖ నుంచి అనుమతి అవసరం.

మరో మార్గంగా, అపోజిట్‌ మార్గంలో టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌తో డ్రిల్లింగ్‌ చేసుకుంటూ రావడం.దీనికి కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విధానాన్ని అమలు చేయాలంటే కనీసం ఆరు నుంచి ఏడు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే, మన్నెవారిపల్లి నుంచి పనిచేస్తున్న టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ కూడా పనిచేయకపోవడంతో ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించి, వీటిలో ఏది వేగంగా, సమర్థంగా అమలు చేయగలమన్న దానిపై నిపుణుల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. దీనిపై క్లారిటీ కూడా రావాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి