Breaking News

ఇండియాను బలవంతంగా లొంగదీసుకోవాలనుకున్న అగ్రరాజ్యంలో దూకుడు తగ్గుతోంది.

ఇండియాను బలవంతంగా లొంగదీసుకోవాలనుకున్న అగ్రరాజ్యంలో దూకుడు తగ్గుతోంది.


Published on: 19 Sep 2025 10:09  IST

డొనాల్డ్ ట్రంప్‌ సన్నిహితులు తరచూ భారత్‌పై విమర్శలు చేసినా, నేరుగా ప్రతిస్పందించకుండా భారత్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించకపోవడం, బహిరంగంగా ప్రతిదాడి చేయకపోవడం న్యూఢిల్లీ తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. ఇటీవల షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో స్నేహపూర్వక భేటీలు జరపడం అమెరికా దృష్టిని ఆకర్షించింది. భారత్‌ తనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే సంకేతం ఇవ్వడం వాషింగ్టన్‌లో అసౌకర్యానికి దారితీసింది.

కొత్త కూటముల ప్రభావం

బ్రిక్స్‌తో పాటు కొత్త ఆర్థిక–రాజకీయ కూటములు వృద్ధి చెందుతున్నాయి. ఈ దేశాలు ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటా కలిగి ఉండటంతో అమెరికా ఆందోళన చెందుతోంది. చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికాపై ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం అమెరికాకు తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితేలో తటస్థంగా ఉన్న భారత్‌పై ఒత్తిడి చేయడం సరైన వ్యూహం కాదని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దన్న ఒత్తిడికి లొంగకుండా భారత్‌ కొత్త భాగస్వామ్యాలను వెతుక్కుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.

చైనాపై అమెరికా తప్పిదాలు

1970ల తర్వాత చైనా వేగంగా ఎదుగుతుంటే, అమెరికా భూభౌగోళిక సంక్షోభాలలో మునిగిపోయింది. దాంతో చైనా ఆర్థిక, సాంకేతిక, సైనిక శక్తిగా ముందంజ వేసింది. దీనిని “చైనా షాక్‌”గా పేర్కొన్నారు. ఇప్పుడు ట్రంప్‌ విధానాలు కూడా అటువంటి పొరపాట్లను పునరావృతం చేస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈసారి భారత్‌తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. అమెరికాను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలనే ట్రంప్‌ దృష్టి ఉన్నా, చైనా ఇప్పటికే హైపర్‌సోనిక్‌ సాంకేతికత, జలాంతర్గామి శక్తుల వంటి రంగాల్లో ముందంజలో ఉంది. ఇలాంటి సందర్భంలో మిత్ర దేశాలను పక్కనపెట్టడం అమెరికా బలహీనతగా మారవచ్చు.

సంబంధాల పునరుద్ధరణ ఆశలు

భారత్‌ అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిష్ఠను పెంచుకుంటోంది. ఇండో పసిఫిక్‌లో భారత్‌ పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో బలమైన సంబంధాలు ఇరుదేశాలకు మేలే. కానీ ట్రంప్‌ 50% సుంకాల నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసింది. అయినప్పటికీ ఇరువైపులా గొంతు తగ్గిన సంకేతాలు కనిపిస్తున్నాయి. చర్చలకు, రాజీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూనే, అమెరికాను వ్యతిరేకించడంలేదని తరచూ చెబుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇండియాతో ప్రతికూలత వల్ల కలిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది.

ఇకపై ఇరుదేశాలు మాటల దాడిని తగ్గిస్తే, ప్రస్తుత ఉద్రిక్తత శాశ్వత సమస్య కాకుండా తాత్కాలిక ఇబ్బందిగానే ముగిసిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి