Breaking News

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన


Published on: 01 Sep 2025 10:06  IST

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై పెద్ద నిర్ణయం వెలువడింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, దీనికి శాసనసభ ఆమోదం తెలిపింది. తొమ్మిదిన్నర గంటలపాటు సాగిన చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ ప్రకటన చేశారు.

సీఎం రేవంత్ మాట్లాడుతూ, కాళేశ్వరం పేరుతో జరిగిన అవకతవకల్లో పాల్గొన్న వారంతా శిక్ష తప్పక అనుభవించాలి అని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా దర్యాప్తు జరిగేలా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని తెలిపారు.

జస్టిస్ పీసీ కమిషన్‌, NDSA (National Dam Safety Authority)తో పాటు ఇతర ఏజెన్సీలు సమర్పించిన నివేదికల్లో అనేక లోపాలు, ఆర్థిక అవకతవకలు, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక తప్పిదాలు బయటపడ్డాయని సీఎం వెల్లడించారు. మూడింటి బ్యారేజీల నిర్మాణంలోనే పెద్ద తప్పిదాలు జరిగాయని, ప్రాజెక్ట్‌కు సరైన ప్లానింగ్‌ కూడా చేయలేదని కమిషన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు.

ప్రత్యేకంగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం సరైన డిజైన్ లేకపోవడం, నాణ్యత నియంత్రణ లోపించడం, ప్లానింగ్ సరిగా చేయకపోవడమేనని NDSA గుర్తించిందని సీఎం తెలిపారు. ఈ అంశాలన్నింటిపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని కమిషన్ సూచించిందని, అందుకే కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని ఆయన అన్నారు.

అలాగే, ఈ ప్రాజెక్ట్‌లో అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం కూడా ఉందని స్పీకర్‌ అనుమతితో సీబీఐకి కేసు అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు.

ఈ నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న రాజకీయ వాదోపవాదాలకు కొత్త మలుపు తిరిగింది. రాబోయే రోజుల్లో సీబీఐ దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి