Breaking News

ధరణి’ అనుమానిత లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌!

ధరణి పోర్టల్‌లో అనుమానాస్పద లావాదేవీల బహిర్గతం – రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్‌కు రెడీ అయిన రెవెన్యూ శాఖ


Published on: 05 Nov 2025 10:12  IST

తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలను గుర్తించేందుకు రెవెన్యూ శాఖ పెద్దఎత్తున ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు నెలలుగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కేరళ ప్రభుత్వ రంగ సంస్థను ప్రయోగాత్మకంగా ఈ పనికి నియమించారు. తాజాగా ఆ సంస్థ ప్రాథమిక నివేదికను సమర్పించగా, అందులో పలు అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

2020 నవంబర్ 2న ధరణి పోర్టల్ ప్రారంభమయ్యాక భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తిగా డిజిటల్ రూపంలో ప్రారంభమయ్యాయి. అయితే ఈ సిస్టమ్‌ను కొందరు దుర్వినియోగం చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. పలు ప్రభుత్వ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు అనుమానాస్పదంగా వ్యక్తుల పేర్లకు మార్చబడినట్లు తేలింది. ఈ లావాదేవీల వెనుక ఉన్న గుట్టును బయటకు తీయడానికే ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు.

2017లో రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల ఎకరాల పట్టా భూములు ఉండగా, 2022–23 నాటికి అదనంగా 25 లక్షల ఎకరాలు పెరిగినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. కొత్తగా భూమి పంపిణీ జరగకపోయినా, యాజమాన్య వివాదాలు ఇంకా పరిష్కారం కాకపోయినా ఇంత విస్తీర్ణం ఎలా పెరిగిందన్న అనుమానాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. కొంతమంది అధికారులు అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు జారీ చేశారనే సమాచారం వెలుగులోకి రావడంతో పూర్తి స్థాయి ఆడిట్ దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల డేటాను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విశ్లేషించారు. లావాదేవీలు జరిగిన సమయం, ఉపయోగించిన కంప్యూటర్లు, బయోమెట్రిక్, డిజిటల్ సంతకాలు, 22–A జాబితాలోని భూముల తొలగింపులపై ఆడిట్‌లో ముఖ్యంగా దృష్టి పెట్టారు. ఆ సంస్థ సమర్పించిన నివేదికపై రెవెన్యూ అధికారులు మరింత లోతుగా విశ్లేషణ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి అనుమానాస్పద రిజిస్ట్రేషన్లు జరిగాయని భావిస్తూ, మొత్తం తెలంగాణలో ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ బాధ్యతను మళ్లీ అదే కేరళ సంస్థకే అప్పగించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. సుమారు రూ.80 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు చేయాలని ప్రణాళిక ఉన్నప్పటికీ, ఖర్చును కొంత తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆమోదం లభించగానే రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి