Breaking News

భారత్‌లో రక్షణ రంగం పుంజుకుంటున్నది – కొత్త పెట్టుబడులు, భారీ కాంట్రాక్టులు

భారత్‌లో రక్షణ రంగం పుంజుకుంటున్నది – కొత్త పెట్టుబడులు, భారీ కాంట్రాక్టులు


Published on: 20 Sep 2025 14:06  IST

మన దేశంలో రక్షణ ఉత్పత్తుల రంగం గత రెండేళ్లలో ఊహించని స్థాయిలో అభివృద్ధి సాధించింది. స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన రక్షణ కంపెనీల షేర్లపై పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపడం వల్ల వాటి విలువలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ధరలు పెరిగినా కూడా ఇంకా ఈ రంగం పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.

ప్రభుత్వరంగంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వంటి సంస్థల షేర్లు బలంగా ఎగబాకాయి. ఇదే సమయంలో ప్రైవేటు రంగంలోని రక్షణ కంపెనీలూ పెట్టుబడిదారులకు లాభాలు అందించాయి.

దీనికి ప్రధాన కారణం – కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకా రక్షణ పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేయడం తగ్గించి, దేశీయ తయారీని ప్రోత్సహించడమే. రక్షణ సామగ్రి సరఫరాలో తప్పనిసరిగా దేశీయ ఉత్పత్తుల భాగస్వామ్యం ఉండాలన్న నిబంధన వల్ల స్వదేశీ కంపెనీలకు పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి.

ప్రైవేట్ రంగం దూసుకొస్తోంది

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి పలు కంపెనీలు కొత్త డివిజన్లు, సబ్సిడరీలను ఏర్పాటు చేస్తున్నాయి.

  • బొండాడ ఇంజినీరింగ్ – రక్షణ ఉత్పత్తుల కోసం బొండాడ డైనమిక్స్ పేరుతో సబ్సిడరీ ఏర్పాటు చేసింది.

  • బ్రైట్‌కామ్ గ్రూప్ (BCG)బ్రైట్‌కామ్ డిఫెన్స్ అనే ప్రత్యేక విభాగాన్ని స్థాపించి, ఏరోస్పేస్ ఇంటెలిజెన్స్, డ్రోన్ రక్షణ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది.

  • బ్లూక్లౌడ్ సాఫ్ట్‌టెక్ – 3పీ విజన్ అనే డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీని కొనుగోలు చేసి, ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు, డ్రోన్ రిస్పాన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేయనుంది.

  • మెగాసాఫ్ట్ – సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌లో విలీనం అవుతూ, ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తుల రంగంలో అడుగుపెడుతోంది.

భారీ కాంట్రాక్టులు – ఎగుమతులపై దృష్టి

2023-24 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర రక్షణ శాఖ రూ.2.10 లక్షల కోట్ల విలువైన 195 కాంట్రాక్టులను దేశీయ కంపెనీలకు అప్పగించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే లక్ష కోట్ల రూపాయల కొత్త కాంట్రాక్టులు జారీ అయ్యాయి. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులు, నేత్ర వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, ట్యాంక్ ఇంజిన్లు, నౌకా ఆయుధ వ్యవస్థలు వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది – 2029 నాటికి కనీసం రూ.50,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం. దేశీయ వినియోగంతో పాటు ఎగుమతుల లక్ష్యాలు చేరుకోవడంలో ఈ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి