Breaking News

అమెరికాలో హెచ్-1బీ వీసా విధానంలో భారీ మార్పులు – భారతీయులకు ఎదురుకానున్న సవాళ్లు

అమెరికాలో హెచ్-1బీ వీసా విధానంలో భారీ మార్పులు – భారతీయులకు ఎదురుకానున్న సవాళ్లు


Published on: 20 Sep 2025 10:06  IST

అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ఆందోళన కలిగించే వార్త వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్-1బీ వీసాలకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి హెచ్-1బీ వీసాపై కంపెనీలు ఏటా లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన ఉత్తర్వు జారీ చేశారు. ఈ నిర్ణయం భారతదేశం, చైనా వంటి దేశాల నుండి వచ్చే నిపుణులపై నేరుగా ప్రభావం చూపనుంది.

అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, దేశీయ ఉద్యోగ అవకాశాలను కాపాడటమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశమని చెప్పారు. “విదేశీ కార్మికులను తీసుకురావడం కన్నా, మన యూనివర్సిటీల్లో చదువుకున్న అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి” అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా టెక్నాలజీ రంగం ఈ విధానాన్ని మద్దతు ఇస్తుందనే నమ్మకాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అయితే, యాపిల్‌, గూగుల్‌, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఈ నిర్ణయంపై ఇంకా స్పందించలేదు.

1990లో ప్రారంభమైన హెచ్-1బీ వీసాలు, అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలో నియమించుకునేందుకు ఒక ప్రధాన మార్గంగా నిలిచాయి. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం హెచ్-1బీ వీసాధారుల్లో భారతీయుల వాటా 71 శాతం కాగా, చైనాకు 11.7 శాతం వాటా ఉంది. ఈ వీసాలను మూడు నుండి ఆరు సంవత్సరాల కాలానికి మంజూరు చేస్తారు.

దీని వలన వేలాది మంది భారతీయులు అమెరికాలో టెక్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం వీసాల కేటాయింపు లాటరీ విధానంలో జరుగుతోంది. లాటరీ దరఖాస్తు సమయంలో సాధారణ ఫీజులు ఉండగా, ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. సాధారణంగా ఈ ఖర్చులను కంపెనీలే భరిస్తాయి. కానీ, కొత్తగా విధించిన లక్ష డాలర్ల రుసుము కంపెనీలకు భారీ ఆర్థిక భారంగా మారనుంది. అమెరికా ప్రతి సంవత్సరం సుమారు 85 వేల వీసాలను లాటరీ విధానం ద్వారా ఇస్తుంది.

ఇక మరోవైపు, ట్రంప్ “గోల్డ్ కార్డు” పేరుతో మరో ప్రత్యేక పథకాన్ని కూడా ప్రకటించారు. దీని కోసం 10 లక్షల డాలర్ల రుసుము నిర్ణయించారు. ఈ పథకం ద్వారా అమెరికాకు దాదాపు 100 బిలియన్ డాలర్ల నిధులు సమకూరుతాయని, వాటిని అభివృద్ధి ప్రాజెక్టులు, పన్నుల రాయితీలు, రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.

అమెరికా తీసుకున్న తాజా నిర్ణయాలు వీసా ఆశిస్తున్న భారతీయులకు, ఇప్పటికే వీసాలపై ఆధారపడి పనిచేస్తున్న కంపెనీలకు కొత్త సవాళ్లను తీసుకురానున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పులు టెక్నాలజీ రంగంపై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి.

Follow us on , &

ఇవీ చదవండి