Breaking News

శరణార్థులకు షాక్‌.. వర్క్‌ పర్మిట్లపై అమెరికా కీలక నిర్ణయం..!

శరణార్థులకు షాక్‌.. వర్క్‌ పర్మిట్లపై అమెరికా కీలక నిర్ణయం..!


Published on: 05 Dec 2025 10:13  IST

వలస విధానాల విషయంలో ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. శరణార్థులు, ఆశ్రయం కోరుతున్న వారు ఉద్యోగం చేయడానికి ఇచ్చే వర్క్ పర్మిట్‌ల కాలవ్యవధిని భారీగా తగ్గిస్తున్నట్లు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారికంగా వెల్లడించింది.

అమెరికాలో వలసదారులు ఉద్యోగం చేయాలంటే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) తప్పనిసరి. గతంలో ఈ వర్క్ పర్మిట్‌కు ఐదేళ్ల వరకూ గడువు ఉండేది. అయితే తాజా మార్పులతో ఈ గడువును కేవలం 18 నెలలకు పరిమితం చేశారు. భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.

ఇటీవల వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవన ప్రాంతానికి సమీపంలో జరిగిన కాల్పుల ఘటనల తర్వాత వలస వచ్చిన వ్యక్తులపై మరింత లోతైన తనిఖీలు అవసరమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ భద్రతకు ప్రమాదం లేకుండా ఉండేందుకు వలస ప్రక్రియలో కఠిన నియమాలు అమలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలనా వర్గాలు చెబుతున్నాయి.

ఈ మార్పు వల్ల శరణార్థులు, ఆశ్రయం కోరేవారు, అలాగే గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వలసదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వారు తరచుగా వర్క్ పర్మిట్‌లను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

EAD అంటే ఏమిటి?
ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) అనేది ఒక వ్యక్తికి నిర్దిష్ట కాలానికి అమెరికాలో చట్టబద్ధంగా పని చేసే హక్కు ఉందని నిరూపించే అధికారిక పత్రం. గ్రీన్‌కార్డు అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు, ఎఫ్-1, ఎం-1 విద్యార్థి వీసాలపై వచ్చినవారు, డిపెండెంట్ వీసాలపై ఉన్నవారు ఉద్యోగం చేయాలంటే ఈ పత్రం తప్పనిసరిగా పొందాలి.

వలస విధానాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వలసదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి