Breaking News

మ్యాన్ హోళ్లు తెరిస్తే క్రిమినల్​కేసు జరిమానాతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా

మ్యాన్​హోల్​మూత తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, నిందితులకు జరిమానాతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా పడుతుందని వాటర్​బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు.


Published on: 23 May 2025 09:02  IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాలు సుదీర్ఘంగా కురుస్తున్న నేపథ్యంలో, రాబోయే మాన్సూన్‌ సీజన్‌కు ముందు జాగ్రత్త చర్యలుగా వాటర్‌బోర్డు భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వర్షాకాలంలో నగరంలో ప్రమాదాలు, అసౌకర్యాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌ అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో నీటి నిల్వలు ఏర్పడిన నేపథ్యంలో, ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్‌హోల్స్‌ ఎవరూ తెరవకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఎవరైనా అక్రమంగా మ్యాన్‌హోల్‌ మూతలు తీస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ చర్యల భాగంగా, నగరాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడదీసి, ప్రతి సెక్షన్‌కు ఓ సీవర్ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరు ప్రతిరోజూ తెల్లవారుజామునే ఫీల్డ్‌లోకి వెళ్లి మ్యాన్‌హోల్స్‌ను పరిశీలిస్తారు. ఎక్కడైనా మూతలు తెరిచి ఉన్నా, ధ్వంసమైనా, నీటి నిల్వలు కనిపించినా వెంటనే వాటర్‌బోర్డు కస్టమర్ కేర్ నంబర్ 155313 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్థానిక వాటర్‌బోర్డు కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

నగరంలో ప్రమాదకరంగా మారుతున్న మ్యాన్‌హోల్స్‌ను నిరోధించేందుకు ఇప్పటికే 25,000కు పైగా మ్యాన్‌హోల్స్‌పై స్టీల్‌ గ్రిల్స్‌ను అమర్చారు. ముఖ్యమైన రహదారులపై ఉన్న మ్యాన్‌హోల్స్‌ ను మూసి, పక్కాగా సీల్‌ చేసి, కనబడేలా ఎరుపు పెయింట్‌తో గుర్తింపుగా వేసారు. దీని ద్వారా రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులకు ప్రమాదం జరగకుండా చూసుకుంటున్నారు.

వర్షాల వేళ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాటర్‌బోర్డు 'ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ERT)' మరియు 'సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ (SPT)'లను ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు అవసరమైన వాహనాలు, రక్షణ పరికరాలు, జనరేటర్‌తో కూడిన డీ-వాటరింగ్ మోటార్లు అందుబాటులో ఉంచారు.ముఖ్యంగా వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను ప్రాధాన్యతతో పర్యవేక్షిస్తూ, వెంటనే నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. మ్యాన్‌హోల్స్ నుంచి ఎప్పటికప్పుడు సిల్ట్‌ (విజారణ పదార్థం) తొలగించే పనులు కూడా జరుగుతున్నాయి.

వర్షకాలంలో విధుల్లో ఉండే పారిశుద్ధ్య సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ శిక్షణలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, వ్యక్తిగత రక్షణ ఎలా కల్పించుకోవాలి వంటి అంశాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు.పౌరులు తమ ప్రాంతాల్లో ఎక్కడైనా మ్యాన్‌హోల్ సమస్యలు, నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు గమనిస్తే వెంటనే వాటర్‌బోర్డుకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమిష్టిగా చైతన్యంగా వ్యవహరిస్తే వర్షకాలాన్ని సురక్షితంగా ఎదుర్కొనవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement