Breaking News

దేశ రాజకీయాల్లో ‘గ్రోక్‌' ప్రకంపనలు, ప్రధాని మోదీపై ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్యలు

దేశ రాజకీయాల్లో ‘గ్రోక్‌' ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ‘ఎక్స్‌'కు చెందిన ఈ చాట్‌బాట్‌.. అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ.. విపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నది.


Published on: 24 Mar 2025 15:43  IST

దేశ రాజకీయాల్లో ‘గ్రోక్‌’ చాట్‌బాట్ సంచలనం రేపుతున్నది. ఎక్స్ (ట్విట్టర్) రూపొందించిన ఈ చాట్‌బాట్ ముఖ్యంగా కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి కొత్త సమస్యగా మారుతోంది. దాదాపు పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ సహా ఇతర కీలక నేతలపై గ్రోక్ ఇచ్చిన సమాధానాలు రాజకీయ ప్రకంపనలకు దారితీశాయి. బీజేపీకి ఈ చాట్‌బాట్ పెద్ద సవాలుగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

గ్రోక్ వివాదం ఎలా మొదలైంది

ఇటీవల ఎక్స్‌లోని టోకా అనే ఖాతా గ్రోక్‌కు ఓ ప్రశ్న వేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. తన ఖాతాను అనుసరించే వారి నుంచి పదిమందిని ఎంపిక చేయాలని కోరిన టోకాకు, గ్రోక్ ఆలస్యంగా స్పందించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో గ్రోక్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. టోకాతో హిందీలో సంభాషించే క్రమంలో అనుచిత పదజాలాన్ని ఉపయోగించడం పెద్ద చర్చకు దారితీసింది.

ఈ సంఘటన తర్వాత పలువురు గ్రోక్‌ను ప్రశ్నల వరదతో పరీక్షించగా, అందుకు ఆర్డిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ నిర్మొహమాటంగా సమాధానాలు ఇచ్చింది. ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ పాలన, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వంటి కీలక రాజకీయ నాయకుల గురించి ఇచ్చిన సమాధానాలు మరింత కలకలం రేపాయి.

మోదీపై గ్రోక్ ఘాటు వ్యాఖ్యలు

గ్రోక్ ఇచ్చిన కొన్ని సమాధానాలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ఉదాహరణకు, మోదీ ప్రధాని అయ్యాక నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులపై ఓ నెటిజన్ ప్రశ్నించగా, మోదీ ప్రత్యక్షంగా మీడియా ముందుకు రావడం లేదని, అన్ని మీడియా కార్యక్రమాలను అమిత్ షా నిర్వహిస్తున్నారని గ్రోక్ అభిప్రాయపడింది. అంతేకాదు, ప్రధాని మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ ముందుగా ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసిన ప్రశ్నలు, సమాధానాలతోనే ఉంటాయని పేర్కొంది.

మత విద్వేషాలను వ్యాప్తి చేసినందుకు ఏ రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారని ఓ నెటిజన్‌ అడగగా. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ వంటి వారు మతవిద్వేషాలను ఎకువగా ప్రచారం చేస్తున్నారని గ్రోక్‌  పేర్కొనడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు గ్రోక్‌ వాడుతున్న పదజాలంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఏఐ చాట్‌ బాట్‌ వాడే భాషపై కొంత నియంత్రణ ఉండేదని, గ్రోక్‌ ఆ హద్దులను చెరిపేసిందని అంటున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ఘాటు వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  బీజేపీ అనుకూల వార్తలను ప్రచారం చేయడంలో భారీగా నిధులను ఖర్చు చేస్తోందని, ప్రతి సంవత్సరం 140 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోందని పేర్కొంది.

గ్రోక్ సమాధానాల నేపథ్యంలో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో బీజేపీ అనుకూల పోస్టులే అధికంగా ఉంటే, గ్రోక్ కూడా ఆ దిశగా సమాధానాలు ఇవ్వాలని కొంతమంది బీజేపీ సానుభూతిపరులు వాదిస్తున్నా, మరియు గ్రోక్ పూర్తి వివక్షతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి.

ఇక, గ్రోక్‌పై నిరసనగా బీజేపీ ‘గ్రోక్ గో బ్యాక్’ ఉద్యమాన్ని ప్రారంభించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్వయంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎక్స్ నుంచి వివరణ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గ్రోక్ భవిష్యత్తు ఏంటీ

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో గ్రోక్ భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. దీని భాషా శైలి మరింత కఠినంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ చాట్‌బాట్‌ల భాషపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో మరిన్ని రాజకీయ వివాదాలు చెలరేగే అవకాశముందని అంటున్నారు.

మొత్తంగా, గ్రోక్ చాట్‌బాట్ అందిస్తున్న సమాధానాలు బీజేపీకి కొత్త సవాలుగా మారాయి. దీని ప్రభావం భారత రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందో చూడాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి