Breaking News

నాచారంలో ఇంటి యజమాని దారుణ హత్య

హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ బాబానగర్‌కు చెందిన సూరెడ్డి సుజాత (65) అనే ఇంటి యజమానిని ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్న వ్యక్తి బంగారం కోసం దారుణంగా హత్య చేశాడు.


Published on: 30 Dec 2025 14:06  IST

హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ బాబానగర్‌కు చెందిన సూరెడ్డి సుజాత (65) అనే ఇంటి యజమానిని ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్న వ్యక్తి బంగారం కోసం దారుణంగా హత్య చేశాడు. సుజాత ఒంటరిగా నివసిస్తూ ఒంటి నిండా బంగారం ధరించేది. ఆమె వద్ద ఉన్న సుమారు 11 తులాల బంగారాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్న క్యాబ్ డ్రైవర్ ఎం. అంజిబాబు (33) ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

డిసెంబర్ 19వ తేదీ రాత్రి సుజాత వంటగదిలో ఉన్న సమయంలో అంజిబాబు వెనుక నుండి ఆమెపై ముసుగు వేసి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నాడు.హత్య తర్వాత అంజిబాబు తన స్నేహితులు దుర్గారావు, యువరాజుల సహాయంతో మృతదేహాన్ని ఒక సూట్‌కేసులో కుక్కి, కారులో ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు తరలించాడు. రాజోలు సమీపంలోని గోదావరి నదిలో మృతదేహాన్ని పడేసి ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారు.

ఈ నెల 24వ తేదీన సుజాత సోదరి ఇంటికి వచ్చి ఆమె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన నాచారం పోలీసులు, అంజిబాబు కనిపించకపోవడంతో అతనిపై అనుమానంతో పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని మామిడికుదురు సమీపంలో ఉన్న వైనతేయ గోదావరి నది నుండి సుజాత మృతదేహాన్ని వెలికితీశారు. ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి