Breaking News

కరీంనగర్ శ్మశాన వాటికలో దీపావళి సంబరాలు

కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో ఉన్న శ్మశాన వాటికలో దళిత కుటుంబాలు దీపావళిని తమ పూర్వీకుల సమాధుల వద్ద జరుపుకుంటారు.


Published on: 22 Oct 2025 11:24  IST

కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో ఉన్న శ్మశాన వాటికలో గత ఆరు దశాబ్దాలకు పైగా ఒక ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతోంది, దీనిలో దళిత కుటుంబాలు దీపావళిని తమ పూర్వీకుల సమాధుల వద్ద జరుపుకుంటారు. ఇది చాలామందికి వింతగా అనిపించినా, ఈ సంప్రదాయాన్ని స్థానికులు భక్తిశ్రద్ధలతో పాటిస్తారు.పండుగకు వారం రోజుల ముందే కుటుంబసభ్యులు శ్మశాన వాటికకు వచ్చి సమాధులను శుభ్రం చేసి, సున్నం లేదా రంగులతో అలంకరిస్తారు.దీపావళి రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా కలిసి తమ పూర్వీకుల సమాధుల వద్ద దీపాలు వెలిగిస్తారు.చనిపోయిన తమ ప్రియమైన వారికి ఇష్టమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత అక్కడే కూర్చుని వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు.మిగతా ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా బాణసంచా కాలుస్తారు. ఈ వెలుగుల మధ్య పూర్వీకులను స్మరించుకుంటూ దీపావళి వేడుకలను జరుపుకుంటారు.ఇలా చేయడం వల్ల తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుందని, వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచవచ్చని స్థానికులు బలంగా విశ్వసిస్తారు.ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొనడానికి పండుగకు కచ్చితంగా ఇంటికి వస్తారు. ఈ ప్రత్యేకమైన ఆచారంలో భాగంగా కరీంనగర్ శ్మశాన వాటిక ప్రతి ఏటా దీపావళి రోజున విద్యుత్ కాంతులు, బాణసంచా వెలుగులతో కళకళలాడుతుంది. 

Follow us on , &

ఇవీ చదవండి