Breaking News

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కర్ణాటక బీజేపీ నేతలు

తెలంగాణ(Telangana) శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ


Published on: 23 Aug 2023 10:17  IST

బెంగళూరు : తెలంగాణ(Telangana) శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ సర్వశక్తులొడ్డేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ(BJP) నేతలకు నియోజకవర్గాల వారీగా ప్రచార బాధ్యతలను అప్పగిస్తున్నారు. తెలుగు భాష కొద్దోగొప్పో తెలిసిన నేతలకు ప్రాధాన్యతనిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్‌ నేతలు అరవింద లింబావళి, సతీష్ రెడ్డి తదితరులు ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్న సంగతి విదితమే. ఫలితంగా తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా నాలుగు లోక్‌సభా నియోజకవర్గాలను గెలుపొందింది. తెలంగాణతో సరిహద్దు కలిగి ఉన్న హైదరాబాద్‌(Hyderabad) కర్ణాటక ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ తదితర జిల్లాల ప్రచార బాధ్యతలను అప్పగిస్తున్నారు.

కాగా బెంగళూరు నగరానికి చెందిన పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రమంత్రులకు కూడా తెలంగాణ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అధిష్టానం పెద్దల సూచన మేరకు బెంగళూరు మహాలక్ష్మి లే అవుట్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె. గోపాలయ్య రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ నియోజకవ ర్గంలో విస్తృత పర్యటన జరుపుతూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయాత్తం చేస్తున్నారు. ఎవరికి టికెట్‌ లభించినా కలసికట్టుగా విజయం కోసం కృషి చేయాలని బంగారు తెలంగాణ బీజేపీతో మాత్రమే సాధ్యమని గోపాలయ్య తెలుగు భాషలోనే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి ఆకట్టుకుంటున్నారు. బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌, కేంద్రమంత్రి ఎ. నారాయణ స్వామి, మాజీ మంత్రి కట్టాసుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు త్వరలోనే తెలంగాణలోని పలు నియోజకవర్గాలను పర్యటించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి