Breaking News

వైన్స్‌లో చోరీ.. దొరక్కుండా స్మార్ట్ ఆలోచన, ఇంతా చేసి ఎత్తుకెళ్లింది చూస్తే దిమ్మదిరగాల్సిందే.

కరీంనగర్ జిల్లాలో ఓ వైన్ షాపులో జరిగిన చోరీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దుకాణం పైకప్పు కత్తిరించి మరీ.. లోపలికి ప్రవేశించిన దొంగలు.. దొరకకుండా ఉండేందుకు చాలా స్మార్ట్‌గా ఆలోచించారు.


Published on: 28 Mar 2025 17:25  IST

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్ వద్ద ఉన్న దుర్గా వైన్స్‌లో దొంగతనం జరిగింది. ఉదయం దుకాణం తెరిచిన యజమాని, పైకప్పుగా ఉన్న రేకులు కత్తిరించి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చుట్టూ పరిశీలించగా, దొంగతనం జరిగినట్లు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, దొంగతనం ఎలా జరిగిందో, ఎంత సరుకు పోయిందో పరిశీలించారు. యజమాని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా దొంగలు ఎలా చోరీ చేశారు? ఏం తీసుకెళ్లారు? వాళ్లు ఎవరు? అన్న విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో దుకాణంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే, దొంగలు ముందుగానే సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, రికార్డింగ్ స్టోరేజ్ బాక్స్‌ను కూడా తీసుకెళ్లారు,పోతూ పోతూ ఇన్వర్టర్‌ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు.ఇంతా చేసిన దొంగలు ఎత్తుకెళ్లింది మాత్రం కేవలం రెండు బీర్ బాటిళ్లే, పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.

షాప్ యజమాని రాత్రి మూసే ముందు స్టాక్‌ను లెక్కచూసి రాసుకున్న లెక్కల ప్రకారం.కేవలం రెండు బీర్ బాటిళ్లు మాత్రమే తగ్గిపోయాయని స్పష్టంగా తెలిసింది. దీనితో పోలీసులు ఒక అనుమానానికి వచ్చారు – ఈ దొంగలు మందుబాటిళ్ల కోసం కాకుండా కౌంటర్‌లోని డబ్బు కోసం వచ్చి ఉంటారని. కానీ, కౌంటర్‌లో పెద్దగా డబ్బు లేకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌లో ఈ విధంగా వ్యవహరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి