Breaking News

ఆ జిల్లా విద్యార్థులకు తీపికబురు.. రెండు కళాశాలలను మంజూరు చేసిన ప్రభుత్వం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరీంనగర్ పట్టణంలో ఒక లా కాలేజీ, హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది.


Published on: 28 Mar 2025 22:49  IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులకు మేలైన అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ పట్టణంలో ప్రభుత్వ లా కాలేజీ, హుస్నాబాద్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం కేవలం కరీంనగర్, హుస్నాబాద్, సైదాపూర్, చిగురుమామిడి మండలాల విద్యార్థులకు మాత్రమే కాకుండా, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని విద్యార్థులకు ప్రయోజనం కలిగించనుంది.

ప్రస్తుతం ఈ జిల్లాలో ఇప్పటికే 12 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నా, హుస్నాబాద్‌లో కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ రావడం ఇక్కడి విద్యార్థులకు అదనపు ప్రయోజనంగా మారనుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇంజినీరింగ్ చదవాలంటే ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, వారికి సొంత జిల్లాలోనే ప్రభుత్వ కాలేజీ లభించనుంది.

ఇక, జిల్లా పరిధిలో న్యాయవాదుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ లా కాలేజీ లేదు. దీంతో, విద్యార్థులు ప్రైవేట్‌ కాలేజీలను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు కరీంనగర్‌లో ప్రభుత్వ లా కళాశాల ఏర్పాటుతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చక్కటి అవకాశం లభించనుంది. దీనికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఆధారంగా చేసుకుని రూ.22.96 కోట్లు మంజూరు చేసింది. అలాగే, హుస్నాబాద్‌లో కొత్తగా వచ్చే ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణానికి రూ.44.12 కోట్ల నిధులు కేటాయించడంతో పాటు, భవన నిర్మాణం, ఇతర సౌకర్యాలను సిద్ధం చేయనుంది. ఈ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 240 సీట్లు భర్తీ చేయనున్నారు. మొదటి సంవత్సరంలో ఒక్కో కోర్సుకు 60 సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఈ నిర్ణయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, తాను కరీంనగర్‌ ఎంపీగా ఉన్న సమయంలో లా కళాశాల, ఇంజినీరింగ్‌ కాలేజీ కోసం కృషి చేసినట్లు తెలిపారు. పలుమార్లు ప్రతిపాదనలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అవి మంజూరవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి