Breaking News

హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ పరస్పర దాడులు

హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ జూన్ 1, 2026 నాటికి పరస్పర దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన 'MQ-1 ప్రిడేటర్' డ్రోన్‌ను ఇరాన్ దళాలు కూల్చివేయడంతో ఈ తాజా ఉద్రిక్తతలు మొదలయ్యాయి.


Published on: 01 Jun 2026 11:36  IST

హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ జూన్ 1, 2026 నాటికి పరస్పర దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన 'MQ-1 ప్రిడేటర్' డ్రోన్ను ఇరాన్ దళాలు కూల్చివేయడంతో ఈ తాజా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనికి ప్రతిచర్యగా అమెరికా మిలిటరీ ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడగా, ఇరాన్ కూడా అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేసింది.

అమెరికా వైమానిక దాడులు: యూఎస్ డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసినందుకు ప్రతీకారంగా శని, ఆదివారాల్లో అమెరికా యుద్ధ విమానాలు దక్షిణ ఇరాన్ తీర ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి.

లక్ష్యాలు: ఇరాన్ పరిధిలోని గెరుక్నగరం, క్విష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ రాడార్ వ్యవస్థలు, డ్రోన్ నియంత్రణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలతో పాటు, రెండు సూసైడ్ డ్రోన్లను కూడా ధ్వంసం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

ఇరాన్ ప్రతీకారం: అమెరికా దాడులకు స్పందిస్తూ, తమ భూభాగంపై దాడి చేయడానికి అమెరికా సైన్యం ఉపయోగించిన ఒక ముఖ్యమైన వైమానిక స్థావరాన్ని తాము క్షిపణులతో విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సోమవారం (జూన్ 1) ప్రకటించింది.

ఈ తాజా సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా మిత్రదేశమైన కువైట్‌పైకి డ్రోన్లు, క్షిపణుల దాడి జరిగింది. కువైట్ సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన ఈ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా గాల్లోనే అడ్డుకుని కూల్చివేసినట్లు కువైట్ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడి ఇరాన్ లేదా ఇరాక్ మిత్ర దళాల నుంచే జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 2026 లో ప్రారంభమైన ఈ యుద్ధాన్ని ముగించేందుకు, గత కొన్ని వారాలుగా పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతున్నాయి. 60 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించేందుకు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వస్తున్నాయనే తరుణంలో ఈ తాజా దాడులు జరిగాయి. ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. ఇరాన్ హక్కులను పూర్తిగా రక్షించే వరకు, తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే వరకు అమెరికాతో ఎలాంటి శాంతి ఒప్పందం కుదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు ఐదో వంతు ఈ హార్ముజ్ జలసంధి మార్గం గుండానే వెళ్తుంది. హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇది భారత్ సహా గ్లోబల్ మార్కెట్లను మళ్లీ ఆందోళనలోకి నెట్టింది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement