Breaking News

తిరుప్పరంకుండ్రం మురుగన్​ను పూజిస్తే- కుజ, సర్ప దోషాలు మాయం- వివాహం, సంతానం ఖాయం!

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలలో రెండవదిగా భాసిల్లుతున్న తిరుప్పరంకుండ్రం తమిళనాడులో ఉంది. కార్తికేయుడు దేవసేనను పెళ్లాడిన క్షేత్రంగా ఖ్యాతి చెందిన ఈ ఆలయ విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.


Published on: 20 Mar 2025 01:58  IST

తిరుప్పరంకుండ్రం తమిళనాడులోని మధురై సమీపంలో ఉంది. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఈ పవిత్ర స్థలం వెలసింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో రెండవది ఇది. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుని కుమార్తె దేవసేనతో కల్యాణం చేసుకున్నారు.

ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ఇతర సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామి నిలబడి దర్శనమిస్తారు, కానీ తిరుప్పరంకుండ్రంలో మాత్రం స్వామి సింహాసనంపై కూర్చొని ఉంటారు.

ఆలయ స్థల పురాణం ప్రకారం, సుబ్రహ్మణ్య స్వామి భార్యలు శ్రీ వల్లి, దేవసేనలు శ్రీ మహావిష్ణువు కుమార్తెలు. వీరి అసలు పేర్లు అమృత వల్లి, సుందర వల్లి.

అమృత వల్లిని ఇంద్రుడు తన కుమార్తెగా దత్తత తీసుకుని పెంచాడు. సుందర వల్లిని భిల్ల నాయకుడు అంటే గిరిజన నాయకుడు పెంచాడు.

పరాశర మహర్షి ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శాపాన్ని పొందుతారు. తమ శాప విమోచనం కోసం వారు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. సుబ్రహ్మణ్యుడు తాను  తిరుప్పరంకుండ్రం వచ్చినపుడు వారి శాప విమోచనం కలుగుతుందని అభయమిచ్చారు.

తిరుచెందూర్‌లో సూర పద్మాసురుడిని సంహరించిన తర్వాత, సుబ్రహ్మణ్య స్వామి దేవతలందరితో కలిసి తిరుప్పరంకుండ్రం వచ్చారు. ఈ సమయంలో పరాశర మహర్షి కుమారులకు శాప విమోచనం కలిగి స్వస్వరూపం లభించింది. వారు స్వామిని ఈ క్షేత్రంలో స్థిరంగా ఉండమని ప్రార్థించగా, స్వామి అంగీకరించారు. అనంతరం విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని స్వామికి వివాహం చేయాలని బ్రహ్మ, మహావిష్ణువుల సమక్షంలో కోరాడు. స్వామి అంగీకరించి తిరుప్పరంకుండ్రంలోనే వీరి వివాహం జరిగింది.

దీని కారణంగా ఈ క్షేత్రాన్ని కల్యాణాల క్షేత్రంగా భావిస్తారు.

ఈ ఆలయం ఒకే కొండ రాతితో చెక్కబడింది. ఆలయ ప్రవేశంలో 48 స్తంభాలు ఉండి, వాటిపై దేవతా శిల్పాలు ఉన్నాయి. ఆలయంలోని గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి సింహాసనంపై కూర్చొని దర్శనమిస్తారు.

ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు. కేవలం ఆయన శక్తి శూలానికి మాత్రమే అభిషేకం చేస్తారు. ఆలయంలో కర్పగ వినాయకుడు, మహాదేవుడు, దుర్గాదేవి, శ్రీ మహావిష్ణువు కూడా వెలసి ఉన్నారు.

ఈ క్షేత్రాన్ని కుజ దోషాలు, సర్పదోషాలు నివారించే పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ స్వామిని దర్శించిన వారికి వివాహ యోగం, సంతాన భాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం.

Follow us on , &

ఇవీ చదవండి